డైలమాలో సన్‌రైజర్స్‌!

8 Oct, 2020 17:04 IST|Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభంలోనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు షాక్‌లు మీద షాక్‌లు తగిలాయి. సన్‌రైజర్స్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ గాయపడి టోర్నీకి దూరమైతే, కేన్‌ విలియమ్సన్‌ గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకు ఆడలేదు. దాంతో సన్‌రైజర్స్‌ ఆదిలోనే అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. కాగా, సన్‌రైజర్స్‌ జట్టులోని కీలక సభ్యుడు, పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తుంటి గాయంతో లీగ్‌ నుంచి వైదొలిగాడు. ఇప్పటివకే ఐదు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్‌ రెండు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన సన్‌రైజర్స్‌.. వరుసగా రెండు విజయాలతో టచ్‌లోకి వచ్చింది. కానీ ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్‌ ఆడిన గత మ్యాచ్‌లో మళ్లీ ఓటమి వెక్కిరించింది. ప్రధానంగా బౌలింగ్‌లో బలహీనంగా ఉండటంతో ముంబై ఇండియన్స్‌ భారీ స్కోరు చేసింది. ఈరోజు(గురువారం) కింగ్స్‌ పంజాబ్‌తో పోరుకు సన్నద్ధమైంది ఆరెంజ్‌ ఆర్మీ.(చదవండి: ‘టీ20’ని మార్చండి: సునీల్‌ గావస్కర్‌)

ఈ తరుణంలో మళ్లీ గాడిలో పడాలని భావిస్తున్న సన్‌రైజర్స్‌ పూర్తిగా డైలమాలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టుకు ఐదో బౌలర్‌ ఆప్షన్‌ లేకపోవడమే. ఆ జట్టులో బౌలింగ్‌ వనరులున్నా నమ్మదగిన బౌలర్‌ ఎవరూ కనిపించడం లేదు. సన్‌రైజర్స్‌ పేస్‌ విభాగాన్ని సిద్ధార్థ్‌ కౌల్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌లు పంచుకుంటే నాల్గో బౌలర్‌గా స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఉన్నాడు. కానీ ఐదో బౌలర్‌ ఎవరు అనేది సన్‌రైజర్స్‌కు ప్రశ్న. భువనేశ్వర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన పృథ్వీ రాజ్‌ యర్రాకు వెంటనే అవకాశం రాకపోవచ్చు. ఈ తరుణంలో ఐదో బౌలర్‌ గురించి తర్జన భర్జనలు పడుతుంది సన్‌రైజర్స్‌. స్పిన్నర్‌ షహబాజ్‌ నదీమ్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం కనబడుతోంది. కానీ స్పిన్నర్లను బాగా ఆడే కేఎల్‌ రాహుల్‌ క్రీజ్‌లో కుదురుకుంటే మాత్రం ఇది  మళ్లీ సన్‌రైజర్స్‌కు తలపోటుగా మారిపోవడం ఖాయం.

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అబ్దుల్‌ సామద్‌, కేన్‌ విలియమ్సన్‌లు తలో రెండు ఓవర్లు వేసి ఐదో బౌలర్‌ ఆప్షన్‌ను పంచుకున్నారు. వీరిద్దరూ నాలుగు ఓవర్లలో 51 పరుగులిచ్చారు. దాంతో ఐదో బౌలర్‌గా స్పెషలిస్టు బౌలర్‌ కావాలి. మరి అది స్పిన్నర్‌కు ఇస్తే బాగుంటుందా.. లేక మీడియం ఫాస్ట్‌ బౌలర్‌కు ఇవ్వాలనేది సన్‌రైజర్స్‌కు సవాల్‌గా మారింది. ఒకవేళ పేస్‌ విభాగంలో ఇస్తే బాసిల్‌ థంపిని జట్టులోకి తీసుకురావొచ్చు. విదేశీ ఆటగాళ్లు నలుగురు ఉండాలనే నిబంధనలో భాగంగా జానీ బెయిర్‌ స్టో, డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌, రషీద్‌ ఖాన్‌లకే తుది జట్టులో ఉంటారు. అంటే ఇక్కడ ఐదో బౌలర్‌ అనేవాడు కచ్చితంగా భారత్‌కు చెందిన ఆటగాడే ఉండాలి. అప్పుడు బాసిల్‌ థంపినా, నదీమ్‌లే సన్‌రైజర్స్‌కు అందుబాటులో ఉన్న ప్రధాన బౌలింగ్‌ వనరులు. (చదవండి: శాంసన్‌ రాత మారేనా? మళ్లీ అదే డ్రామానా?)

(చదవండి: సన్‌రైజర్స్‌ ‘గాయం’ ఎంతవరకూ..)

మరిన్ని వార్తలు