నకుల్‌ బంతి స్పెషలిస్ట్‌కు జన్మదిన శుభాకాంక్షలు

5 Feb, 2021 16:14 IST|Sakshi

హైదరాబాద్‌: టీమిండియా స్వింగ్‌ సుల్తాన్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు ప్రపంచవ్యాప్త క్రీడాభిమానుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నేడు (ఫిబ్రవరి 5) భువీ 31వ పడిలోకి అడుగుపెట్టాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈ‌ మీడియం పేసర్‌.. బంతిని రెండువైపులా స్వింగ్‌ చేయడంలో సమర్ధుడు. ప్రతి బంతిలోనూ వైవిధ్యం చూపగలిగే ఈ ఆటగాడు.. ఆరంభ ఓవర్లలో వికెట్లు తీయడంతో పాటు ఆఖరి ఓవర్లలో బంతి వేగంలో వైవిధ్యాన్ని చూపుతూ పొదుపుగా బౌలింగ్‌ చేయడంలో దిట్ట. 'నకుల్'‌ బంతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన భువీ.. సమర్ధవంతమైన బౌలర్‌గానే కాకుండా నమ్మకమైన లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. టీమిండియా తరపున 21 టెస్ట్‌లు, 114 వన్డేలు, 43 టీ20లు ఆడిన భువీ.. 63 టెస్ట్‌ వికెట్లు, 132 వన్డే వికెట్లు, 41 టీ20 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 

ప్రస్తుతం గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న భువీ.. టీమిండియా సాధించిన అనేక విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 2011 ఐపీఎల్‌ సీజన్‌లో పూణే వారియర్స్‌ తరపున బరిలోకి దిగిన భువీ.. సంచలన ప్రదర్శనలతో వెలుగులోకి వచ్చి, జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను.. గాయం కారణంగా గతేడాది కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే పరిమితమయ్యాడు. ఇటీవల ముగిసిన ముస్తాక్‌ అలీ టోర్నీలో పునరాగమనం చేసిన భువీ.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో జట్టులో స్థానం సంపాదించేందుకు కృషి చేస్తున్నాడు. భువీ జన్మదినం సందర్భంగా అతని కెరీర్‌లోని విశేషాలపై ఓ లుక్కేద్దాం.

  • రంజీల్లో సచిన్‌ను డకౌట్‌ చేసిన తొలి బౌలర్‌గా గుర్తింపు
  • వన్డే కెరీర్లో తొలి బంతికే వికెట్‌ సాధించాడు
  • 2014 ఇంగ్లండ్‌ పర్యటనలో 9వ నంబర్‌ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగి మూడు అర్ధశతకాలు సాధించిన తొలి భారత క్రికెటర్‌
  • ఐపీఎల్‌ చరిత్రలో రెండు వరుస సీజన్లలో(సన్‌రైజర్స్‌ తరపున 2016, 2017) పర్పుల్‌ క్యాప్‌ సాధించిన ఏకైక ఆటగాడు
  • మూడు క్రికెట్‌ ఫార్మాట్లలో 5వికెట్ల ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌
మరిన్ని వార్తలు