అవన్నీ తప్పుడు వార్తలు.. నేను ఎప్పుడు సిద్ధమే: భువీ 

15 May, 2021 20:26 IST|Sakshi

ముంబై: భువనేశ్వర్‌ కుమార్‌.. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ ప్రత్యర్థులను తన బౌలింగ్‌తో బెంబేతెత్తిస్తుంటాడు. నకుల్‌ బౌలింగ్‌తో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మ్యాచ్‌ల్లో పరుగులు ఇవ్వకుండా పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ విజయాల్లో భాగమయ్యేవాడు. ముఖ్యంగా డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా నిలిచిన భువీ ఒకానొక సందర్భంలో అన్ని ఫార్మాట్లలో కీలక బౌలర్‌గా మారాడు. కానీ క్రమంగా టెస్టులు ఆడడం తగ్గించేశాడు.

ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భువీని బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. వాస్తవానికి ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి దేశాలు భువీ బౌలింగ్‌కు సరిగ్గా సరిపోతాయి. అయితే భువీ పరిమిత ఓవర్లు, టీ20ల్లో దృష్టి పెట్టేందుకే టెస్టులకు దూరమవుతున్నట్లు సోషల్‌ మీడియాలో రూమర్లు వచ్చాయి.

దీనిపై భువీ స్వయంగా తన ట్విటర్‌ ద్వారా స్పందించాడు. '' టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ఆడడానికి నేను ఎప్పుడూ సిద్దమే. నా దృష్టిలో టెస్ట్ క్రికెట్‌కే మొదటి ఓటు ఉంటుంది. వన్డే, టీ20లపై దృష్టి పెట్టేందుకే నేను టెస్టులు ఆడడం లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఏ బౌలర్‌ అయినా సరే.. సంప్రదాయ క్రికెట్‌కే మొగ్గు చూపుతాడు. ఒక బౌలర్‌కు తన బౌలింగ్‌లో వైవిధ్యం ఎక్కువగా చూపించే అవకాశం టెస్టుల్లోనే లభిస్తుంది. అందుకే పరిమిత ఓవర్ల క్రికెట్‌ కంటే టెస్టులకే ప్రాధాన్యమిస్తా. కేవలం ఊహాగానాల ఆధారంగా నాపై అసత్య ప్రచారాలు రాయొద్దంటూ '' చెప్పుకొచ్చాడు.

ఇక  భారత్ తరఫున భువీ 21 టెస్టులు, 117 వన్డేలు, 48 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 246 వికెట్లు పడగొట్టాడు. అయితే ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో టీమిండియా తరపున బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్‌లు అద్భుతంగా రాణిస్తుండడంతో పరోక్షంగా భువీకి టెస్టుల్లో అవకాశాలు తగ్గిపోయాయి.
చదవండి: WTC Final: కొత్త వ్యూహంతో కివీస్‌ ఆటగాడు

పృథ్వీ షాకు చేదు అనుభవం.. అడ్డుకున్న పోలీసులు

మరిన్ని వార్తలు