Bhuvneshwar Kumar: అరుదైన రికార్డుపై కన్నేసిన టీమిండియా బౌలర్‌

14 Jun, 2022 16:50 IST|Sakshi

సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌లో టీమిండియా తడబడుతుంది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన టీమిండియా మంగళవారం విశాఖ వేదికగా కీలకమ్యాచ్‌ ఆడనుంది. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక కటక్‌ వేదికగా జరిగిన రెండో టి20లో టీమిండియా స్టార్‌ భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో అద్బుత ప్రదర్శన కనబరిచాడు. 4 ఓవర్లు వేసిన భువీ 13 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఇందులో మూడు వికెట్లు పవర్‌ ప్లేలో( తొలి ఆరు ఓవర్లు) రావడం విశేషం. మూడో టి20 జరగనున్న నేపథ్యంలో భువనేశ్వర్‌  ముంగిట అరుదైన రికార్డు ఎదురుచూస్తోంది. టి20ల్లో పవర్‌ ప్లేలో ఎక్కువ వికెట్లు తీసిన జాబితాలో భువనేశ్వర్‌.. విండీస్‌ బౌలర్‌ శామ్యూల్‌ బద్రీ, టిమ్‌ సౌథీలతో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు. ఇవాళ జరిగే మ్యాచ్‌లో పవర్‌ ప్లేలో ఒక వికెట్‌ తీసినా భువీ.. బద్రీ, సౌథీలను అధిగమించి తొలి స్థానంలో నిలవనున్నాడు.

ఇప్పటివరకు భువనేశ్వర్‌ 59 మ్యాచ్‌ల్లో 5.66 ఎకానమీతో 33 వికెట్లు తీశాడు. ఇక వెస్టిండీస్‌కు చెందిన శామ్యూల్‌ బద్రీ 50 మ్యాచ్‌ల్లో 6.29 ఎకానమీతో 33 వికెట్లు తీయగా.. కివీస్‌ బౌలర్‌ సౌథీ 68 మ్యాచ్‌ల్లో 7.30 ఎకానమీతో 33 వికెట్లు తీశాడు. వీరి తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ 58 మ్యాచ్‌ల్లో 6.74 సగటుతో 27 వికెట్లతో ఉండగా.. ఆస్ట్రేలియా ఫాస్ట్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ 30 మ్యాచ్‌ల్లో ఆరు ఎకానమీతో 26 వికెట్లు తీశాడు. ఇక తొలి రెండు టి20ల్లో ఓటమి పాలవ్వడంతో టీమిండియా జట్టులో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ల ఎంట్రీ ఖాయంగా కనబడుతోంది. అక్షర్‌ పటేల్‌, ఆవేశ్‌ ఖాన్‌ స్థానంలో వీరిద్దరు తుదిజట్టులోకి వచ్చే అవకాశముంది.

చదవండి: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. భారత జట్టులో మూడు మార్పులు..!

IND vs SA: 'మ్యాచ్‌ టైట్‌ అయినప్పడు పంత్‌ ఒత్తిడికి గురివుతున్నాడు'

మరిన్ని వార్తలు