డిఫెండింగ్‌ చాంపియన్స్‌ లేకుండానే...

15 Aug, 2020 10:44 IST|Sakshi

యూఎస్‌ ఓపెన్‌కు బియాంకా కూడా దూరం

మాంట్రియల్‌ (కెనడా): ఈసారి యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ సింగిల్స్‌ విభాగాల్లో డిఫెండింగ్‌ చాంపియన్స్‌ లేకుండానే జరగనుంది. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌ విభాగంలో రాఫెల్‌ నాదల్‌ వైదొలగగా... మహిళల సింగిల్స్‌ విభాగంలో గత ఏడాది విజేత బియాంకా ఆండ్రెస్కూ (కెనడా) కూడా ఈసారి బరిలోకి దిగకూడదని నిర్ణయం తీసుకుంది. ‘కరోనా వైరస్‌ పరిస్థితుల నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్‌కు పూర్తిస్థాయిలో సిద్ధంకాలేకపోయాను. నా శిక్షణ సిబ్బందితోపాటు శ్రేయోభిలాషులతో తీవ్రంగా చర్చించి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాను.

ఇక మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సంతరించుకోవడానికి శ్రమిస్తాను. ఆ తర్వాతే పునరాగమనం చేస్తాను’ అని ప్రపంచ ఆరో ర్యాంకర్‌ ఆండ్రెస్కూ వివరించింది. గతేడాది యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో 20 ఏళ్ల ఆండ్రెస్కూ 6–3, 7–5తో అమెరికా దిగ్గజం సెరెనాను ఓడించి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గింది. యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఇప్పటికే ప్రపంచ నంబర్‌వన్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), ఐదో ర్యాంకర్‌ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్‌), ఏడో ర్యాంకర్‌ కికి బెర్‌టెన్స్‌ (నెదర్లాండ్స్‌), 2004 చాంపియన్‌ స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా) వైదొలిగారు. యూఎస్‌ ఓపెన్‌ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు న్యూయార్క్‌లో జరుగుతుంది.
 

మరిన్ని వార్తలు