ICC World Cup Super League: వన్డే సిరీస్‌ రద్దు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్‌! ప్రపంచకప్‌ రేసు నుంచి తప్పుకొన్నట్లేనా?

13 Jul, 2022 13:08 IST|Sakshi
ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ రద్దు(PC: Cricket Australia)

ICC ODI World Cup 2023: దేశవాళీ టీ20 క్రికెట్‌ లీగ్‌ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రొటిస్‌ ప్రపంచకప్‌-2023 టోర్నీ అర్హత అవకాశాలను తీవ్రంగా దెబ్బతీయనుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను రద్దు చేసుకునే పరిస్థితులు తలెత్తిన తరుణంలో వరల్డ్‌కప్‌ ఈవెంట్‌లో నేరుగా అడుగుపెట్టే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. 

కాగా దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 17 వరకు ప్రొటిస్‌ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడాల్సి ఉంది. అయితే, తమ దేశంలో కొత్తగా టీ20 దేశవాళీ క్రికెట్‌ లీగ్‌ నేపథ్యంలో షెడ్యూల్‌ను మార్చాల్సిందిగా దక్షిణాఫ్రికా బోర్డు.. ఆసీస్‌ బోర్డుకు విజ్ఞప్తి చేసింది.

అస్సలు కుదరదు!
కానీ, ఇప్పటికే కంగారూల క్యాలెండర్‌ వివిధ అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీగా ఉన్న కారణంగా రీషెడ్యూల్‌ చేసేందుకు వీలుపడదని ఆసీస్‌ బోర్డు స్పష్టం చేసింది. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రొటిస్‌ బోర్డు ఆసీస్‌తో వన్డే సిరీస్‌ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ సూపర్‌లీగ్‌ పాయింట్ల పట్టికలో పదకొండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాకు మెగా ఈవెంట్‌ ఎంట్రీ సంక్లిష్టతరం కానుంది. వచ్చే ఏడాది భారత్‌ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్‌ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే.

వన్డే వరల్డ్‌కప్‌ రేసు నుంచి ప్రొటిస్‌ జట్టు అవుట్‌?!
సూపర్‌లీగ్‌లో టాప్‌-8లో నిలిచిన జట్లు ఈ ఈవెంట్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. దక్షిణాఫ్రికా పరిస్థితి ఇలా ఉంటే ఆస్ట్రేలియా ఇప్పటికే 70 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. జింబాబ్వేతో టూర్‌ నేపథ్యంలో మరో మూడు వన్డేలు ఆడనుంది కూడా! 

దీంతో దక్షిణాఫ్రికా సిరీస్‌ రద్దు చేసుకున్న కారణంగా కంగారూలకు పెద్దగా నష్టమేమీ లేదు! ఈ విషయంపై స్పందించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈఓ మాట్లాడుతూ.. ‘‘జనవరిలో జరగాల్సిన వన్డే సిరీస్‌ నుంచి దక్షిణాఫ్రికా తప్పుకోవడం నిరాశ కలిగించింది.అయితే, మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ మాత్రం యథావిథిగా జరుగుతుంది. మా షెడ్యూల్‌ బిజీగా ఉన్న కారణంగానే వన్డే సిరీస్‌ను రీషెడ్యూల్‌ చేసే పరిస్థితి కనిపించడం లేదు’’ అని పేర్కొన్నారు.  

పూర్తిగా తప్పుకొన్నట్లేనా? కాదు!
మొత్తం 13 దేశాలు పాల్గొనే ఈ సూపర్‌ లీగ్‌లో 12 ఐసీసీ పూర్తిస్థాయి సభ్యత్వం కల్గిన దేశాలతో పాటు నెదర్లాండ్స్‌ పోటీ పడనుంది. ఈ క్వాలిఫికేషన్‌ రౌండ్‌కు నెదర్గాండ్స్‌ గతంలోనే అర్హత సాధించింది. 2015-17లో నిర్వహించిన ఐసీసీ వరల్డ్‌ క్రికెట్‌ సూపర్‌ లీగ్‌లో విజేతగా నిలవడం ద్వారా నెదర్లాండ్స్‌ వరల్డ్‌కప్‌- 2023 క్వాలిఫికేషన్‌ రేసులో నిలిచింది. మరో రెండు దేశాల కోసం క్వాలిఫికేషన్‌ రౌండ్‌ నిర్వహిస్తున్నారు. 

ఇక ఆతిథ్య దేశం భారత్‌ ప్రపంచకప్‌-2023కి నేరుగా అర్హత సాధించిన విషయం తెలిసిందే. అదే సమయంలో టాప్‌-8 స్థానాల్లో ఉన్న మరో ఏడు పూర్తిస్థాయి సభ్య దేశాలు కూడా పోటీకి నేరుగా క్వాలిఫై అవుతాయి. కాబట్టి దక్షిణాఫ్రికా గనుక టాప్‌-8లో స్థానం దక్కించుకోలేకపోతే నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోతుంది. ఇందుకోసం అసోసియేట్‌ దేశాలతో క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో విజయం సాధించిన రెండు జట్లు రేసులో నిలుస్తాయి.

చదవండి: IND VS ENG 1st ODI: రోహిత్‌ శర్మ భారీ సిక్సర్‌.. బంతి తగిలి చిన్నారికి గాయం
Jasprit Bumrah: ఇంగ్లండ్‌ బ్యాటర్లను ఉతికి ‘ఆరే’సిన బుమ్రా.. అద్భుతం అంటూ వారిని ట్రోల్‌ చేసిన భార్య సంజనా!

మరిన్ని వార్తలు