BGT 2023: టీమిండియాకు భారీ షాక్‌.. ఆసీస్‌తో టెస్ట్‌ సిరీస్‌ నుంచి స్టార్‌ ప్లేయర్‌ ఔట్‌

10 Feb, 2023 15:12 IST|Sakshi

IND VS AUS Test Series: బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023లో ఆసీస్‌తో తలపడుతున్న టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా 4 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ మొత్తానికే దూరమవుతాడని బీసీసీఐ వర్గాల సమాచారం. గాయం (వెన్ను గాయం) కారణంగా తొలి రెండు టెస్ట్‌లకు దూరంగా ఉన్న బుమ్రా, తదుపరి జరిగే రెండు టెస్ట్‌లకు కూడా దూరంగా ఉంటాడని తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌ పొందుతున్న బుమ్రాను ఆసీస్‌తో జరుగబోయే 3, 4 టెస్ట్‌లకు కూడా పరిగణలోకి తీసుకోకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి.

ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 100 శాతం ఫిట్‌నెస్‌ సాధించే వరకు బుమ్రాను జట్టులోకి తీసుకోకూడదని, ఇంత హడావుడిగా అతన్ని జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం లేదని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. గత ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న బుమ్రాకు ఇంకొంతకాలం​ విశ్రాంతినివ్వాలని, తద్వారా వరల్డ్‌కప్‌లో అతని సేవలు 100 శాతం ఉపయోగించుకోవచ్చన్నది బీసీసీఐ ప్లాన్‌గా తెలుస్తుంది.  బుమ్రా విషయంలో బీసీసీఐ ప్లాన్‌లు ఎలా ఉన్నా.. అతను జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలంటే తప్పక ఫిట్‌నెస్‌ టెస్ట్‌తో పాటు ఫామ్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుందని సెలెక్టర్లు అంటున్నారు.

కాగా, చేతన్‌ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలెక్టర్లు ఆసీస్‌తో 3, 4 టెస్ట్‌ల కోసం టీమిండియాను అతి త్వరలో ప్రకటించనున్నారు. ఈ మ్యాచ్‌లతో పాటు వన్డే సిరీస్‌ కోసం కూడా భారత జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం జరిగే ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో బుమ్రా సఫలమైతే అతన్ని వన్డే జట్టులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు స్టార్‌ పేసర్‌ అయిన బుమ్రా లేకుండానే టీమిండియా గతకొంతకాలంగా అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో అతన్ని హడావుడిగా జట్టులోకి తీసుకురావాల్సిన అవస​రం లేదని అభిమానలు సైతం అభిప్రాయపడుతున్నారు. బుమ్రా గైర్హాజరీలో మహ్మద్‌ సిరాజ్‌ అద్భుతంగా రాటుదేలాడు. ఇటీవలే సిరాజ్‌ మియా వన్డేల్లో టాప్‌ ర్యాంకింగ్‌ బౌలర్‌గా కూడా అవతరించాడు. అతనికి షమీ, అర్షదీప్‌ సింగ్‌ సహకిస్తున్నారు.

ఇదిలా ఉంటే, BGT-2023లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌట్‌ కాగా.. రోహిత్‌ శర్మ (120) సెంచరీతో చెలరేగడంతో టీమిండియా 82 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 71 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. రవీంద్ర జడేజా (44), అక్షర్‌ పటేల్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 
 

మరిన్ని వార్తలు