Venkatesh Iyer: అప్పుడు హీరోలా కనిపించాడు; ఇప్పుడు విలన్‌.. ఎందుకిలా!

29 Apr, 2022 20:26 IST|Sakshi
Courtesy: IPL Twitter

వెంకటేశ్‌ అయ్యర్‌.. గత ఐపీఎల్‌ సీజన్‌ ద్వారా  ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్‌ 14వ సీజన్‌లో తొలి అంచె పోటీల్లో వెంకటేశ్‌ అయ్యర్‌ పెద్దగా అవకాశాలు లభించలేదు. అయితే కరోనా బ్రేక్‌ తర్వాత జరిగిన రెండో అంచె పోటీల్లో మాత్రం దుమ్ములేపాడు. కేకేఆర్‌ ఫస్టాఫ్‌లో రెండే మ్యాచ్‌లు గెలిచి అసలు ప్లేఆఫ్‌ చేరుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే వెంకటేశ్‌ అయ్యర్‌ రాకతో కేకేఆర్‌ ఆట స్వరూపమే మారిపోయింది.

ఎవరు ఊహించని విధంగా ఫైనల్‌ చేరిన కేకేఆర్‌ ఆఖరి మెట్టుపై బోల్తా పడి రన్నరప్‌గా నిలిచింది. సీఎస్‌కేతో ఫైనల్లో ఓడినప్పటికి కేకేఆర్‌ తన ఆటతీరుతో ఆకట్టుకుంది. అందుకు ప్రధాన కారణం వెంకటేశ్‌ అయ్యర్‌ అని చెప్పొచ్చు. ఆ సీజన్‌లో ఓపెనర్‌గా వచ్చిన వెంకటేశ్‌ అయ్యర్‌ ఆరంభం నుంచే దూకుడైన ఆటతీరు కనబరిచాడు. మొత్తంగా 10 ఇన్నింగ్స్‌ల్లో 128.47 స్ట్రైయిక్ రేటుతో 41.11 యావరేజ్‌తో 370 పరుగులు చేశాడు వెంకటేశ్ అయ్యర్. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి... బౌలింగ్‌లోనూ 3 వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండర్‌గా మెప్పించాడు. 


Courtesy: IPL Twitter
గత సీజన్ ప్రదర్శన కారణంగా వెంకటేశ్ అయ్యర్‌ని ఏకంగా రూ.8 కోట్లకు రిటైన్ చేసుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. అయితే ఈ సీజన్‌లో అయ్యర్ ఘోర ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ సీజన్‌లో 9 మ్యాచులు ఆడిన వెంకటేశ్ అయ్యర్ కేవలం 132 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ముంబై ఇండియన్స్‌పై 41 బంతుల్లో చేసిన 50 పరుగులు మినహాయిస్తే... మిగిలిన 8 మ్యాచ్‌లు కలిపి 82 పరుగులు మాత్రమే చేశాడు. గత సీజన్‌లో తన ప్రదర్శనతో హీరో అనిపించుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌.. ఈ సీజన్‌లో కాస్త విలన్‌గా తయారయ్యాడు.


Courtesy: IPL Twitter
గత సీజన్‌ ఆరంభంలోనే బౌలర్లపై విరుచుకుపడిన వెంకటేశ్‌ అయ్యర్‌ అదే స్పీడును ఇప్పుడు మాత్రం చూపెట్టలేక చతికిలపడుతున్నాడు. కేకేఆర్‌కు ఇది ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 పరుగులు రావాల్సిన చోట సింగిల్ మాత్రమే తీసి వెంకటేశ్‌ అయ్యర్‌ స్ట్రైక్‌ ఉంచుకున్నాడు. అయ్యర్‌ చేసిన ఈ పొరపాటు మ్యాచ్‌ ఫలితాన్నే మార్చేసింది. ఆ తర్వాతి ఓవర్‌లో 4 వికెట్లు తీసి హ్యాట్రిక్‌తో మెరిసిన చహల్‌ కోల్‌కతాను విజయానికి దూరం చేశాడు. గత సీజన్‌లో విఫలమయిన హార్ధిక్ పాండ్యా ఈసారి కెప్టెన్‌గా, ఫీల్డర్‌గా, బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా దూసుకుపోతుంటే... వెంకటేశ్ అయ్యర్ మాత్రం టీమిండియా ఎంట్రీ తర్వాత ఉన్న నమ్మకాన్ని కాస్తా కోల్పోయినట్టు కనిపిస్తున్నాడు.

చదవండి: IPL 2022: పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌.. తీవ్ర దిగ్బ్రాంతిలో లక్నో సూపర్‌ జెయింట్స్‌

Shreyas Iyer: మా ఓటమికి కారణం అదే.. మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే!

మరిన్ని వార్తలు