India Open 2023: ఇండియా ఓపెన్‌ టోర్నీ.. సింధు సత్తాకు సవాల్‌

17 Jan, 2023 08:58 IST|Sakshi

న్యూఢిల్లీ: స్వదేశంలో మరోసారి సత్తా చాటుకోవాలనే లక్ష్యంతో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్, సైనా నెహ్వాల్‌ నేటి నుంచి మొదలయ్యే ఇండియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీలో బరిలోకి దిగనున్నారు. మాజీ చాంపియన్‌ పీవీ సింధు నేడు జరిగే మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 21వ ర్యాంకర్‌ సుపనిద కటెథోంగ్‌ (థాయ్‌లాండ్‌)తో... ప్రపంచ 31వ ర్యాంకర్‌ మియా బ్లిచ్‌ఫెల్ట్‌ (డెన్మార్క్‌)తో సైనా నెహ్వాల్‌ తలపడనున్నారు.

గత ఏడాది ఇదే టోర్నీ సెమీఫైనల్లో సుపనిద చేతిలో సింధు ఓడిపోగా... మియా బ్లిచ్‌ఫెల్ట్‌తో గతంలో ఆడిన రెండుసార్లూ సైనాకు ఓటమి ఎదురైంది. ఈ నేపథ్యంలో సింధు, సైనాలకు తొలి రౌండ్‌లోనే కఠిన పరీక్ష ఎదురుకానుంది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ లక్ష్య సేన్‌ భారత్‌కే చెందిన ప్రణయ్‌తో తొలి రౌండ్‌లో ఆడనున్నాడు.

గతవారం మలేసియా ఓపెన్‌ టోర్నీ తొలి రౌండ్‌లో వీరిద్దరు తలపడగా ప్రణయ్‌ పైచేయి సాధించాడు. బుధవారం జరిగే మరో తొలి రౌండ్‌ లో ప్రపంచ నంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)తో కిడాంబి శ్రీకాంత్‌ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్‌ 3–9తో వెనుకంజలో ఉన్నాడు.
చదవండి: Australian Open 2023: శ్రమించి... శుభారంభం

మరిన్ని వార్తలు