బయో బుడగలో ఎదురయ్యే సమస్యలపై దాదా కామెంట్స్‌

6 Apr, 2021 20:07 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఆయా జట్లు నిర్వహిస్తున్న బయో బబుల్‌లో ఉంటూ క్రికెట్‌ ఆడటం కష్టమే అయినప్పటికీ, భారతీయ క్రికెటర్లు మాత్రం సమర్ధవంతంగా తట్టుకోగలరని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ధీమా వ్యక్తం చేశారు. బయో బుడగలో ఉత్పన్నమయ్యే మానసిక సమస్యలను విదేశీ క్రికటర్ల కన్నా భారతీయ క్రికెటర్లు మెరుగ్గా ఎదుర్కొనగలరని వెల్లడించారు. ఆరేడు నెలలుగా బయో బుడగల్లో విపరీతమైన క్రికెట్‌ జరుగుతోందని, ఇది చాలా కఠినమైన విషయమని పేర్కొన్నాడు. 

ఇటువంటి సందర్భాల్లో క్రికెటర్ల మానసిక వైఖరి బాగుంటేనే ఒత్తిడిని సమర్ధవంతంగా ఎదుర్కొనగలరని తెలిపాడు. మానసిక ఆరోగ్యం విషయంలో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ క్రికెటర్లు చాలా సున్నితంగా ఉంటారని, ఆ విషయాన్ని తాను దగ్గరగా చూశానని వెల్లడించాడు. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌కు ముందు ఆసీస్‌ స్టార్‌ ఆటగాళ్లు మిచెల్ మార్ష్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌లు బయో బబుల్‌లో రెండు నెలలు గడపడం కష్టమంటూ లీగ్‌ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన విషయాన్ని ఆయన ఉదహరించాడు.

కాగా, కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రస్తుతం క్రికెటర్లందరూ బుడగల్లోనే ఉంటూ మానసిక ఒత్తిడి అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సైతం బాహాటంగానే వ్యతిరేకించాడు.

చదవండి: ఊపిరి పీల్చుకున్న ముంబై.. ఆటగాళ్లందరికీ కరోనా నెగిటివ్‌
 

మరిన్ని వార్తలు