Commonwealth Games 2022: 322 మందితో కూడిన జంబో టీమ్‌ను ప్రకటించిన భారత ఒలింపిక్‌ సంఘం

17 Jul, 2022 10:29 IST|Sakshi

బర్మింగ్‌హామ్ వేదికగా జులై 28 నుంచి ఆగస్ట్‌ 8 వరకు జరిగే కామన్వెల్త్ క్రీడలకు జంబో టీమ్‌ను ప్రకటిం‍చింది భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోసీ). ఆటగాళ్లు, అధికారులతో కూడిన 322 మంది సభ్యుల వివరాలను ఐవోసీ శనివారం విడుదల చేసింది. ఈ బృందంలో 215 మంది అథ్లెట్లు, 107 మంది అధికారులు, ఇతర సహాయక సిబ్బంది ఉన్నారు. 

ఈ క్రీడల్లో తొలిసారి మహిళల క్రికెట్‌కు అవకాశం కల్పించడంతో హర్మాన్‌ నేతృత్వంలోని భారత మహిళా క్రికెట్‌ జట్టు కూడా వీరితో పాటే బర్మింగ్‌హామ్ ఫ్లైట్‌ ఎక్కనుంది. క్రీడాకారులందరికీ ఐదు గ్రామాల్లో వేర్వేరు చోట్ల వసతి ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో భారత్ 15 విభిన్న క్రీడా విభాగాల్లో పోటీ పడుతోంది. వీటితో పాటు నాలుగు పారా స్పోర్ట్స్‌లోనూ భారత్‌ పాల్గొంటుంది. 

ఐవోసీ ప్రకటించిన 215 మంది సభ్యుల బృందంలో నీరజ్ చోప్రా, పీవీ సింధు, లోవ్లీనా బోర్గొహైన్, మీరాబాయి చాను, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్, మనీకా బాత్రా, హిమ దాస్, తేజేందర్ పాల్ సింగ్ టూర్, అమిత్ పంఘాల్ వంటి మేటీ క్రీడాకారులు ఉన్నారు. కాగా, కామన్వెల్త్ గేమ్స్ చివరిసారిగా 2018లో ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పోటీల్లో భారత్‌ పతకాల పట్టికలో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలువగా.. ఇంగ్లండ్‌ రెండో స్థానంలో నిలిచింది.
చదవండి: 90 మీటర్లే టార్గెట్‌గా.. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో నీరజ్‌ చోప్రా

మరిన్ని వార్తలు