క్లీనర్‌ సహాయంతో ఫిక్సింగ్‌

6 May, 2021 06:01 IST|Sakshi

ఐపీఎల్‌లో బుకీల ఏర్పాటు

బీసీసీఐ ఏసీయూ చీఫ్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో కొత్త తరహా ఫిక్సింగ్‌కు ప్రయత్నం జరిగినట్లు తేలింది. ఇందు కోసం బుకీలు మైదానంలోనే పని చేసే క్లీనర్‌ను ఉపయోగించుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్‌ షబ్బీర్‌ హుస్సేన్‌ వెల్లడించారు. మంగళవారం నిరవధికంగా వాయిదా పడిన లీగ్‌లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలోనూ మ్యాచ్‌లు జరిగాయి. మ్యాచ్‌లు జరిగే సమయంలో మైదానాన్ని శుభ్రపరిచే సిబ్బందికి అక్రిడేషన్‌ కార్డులు జారీ చేశారు. ఇలా అధికారికంగా కార్డు పొందిన ఒక వ్యక్తి మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో బుకీలతో మాట్లాడుతున్నట్లుగా పోలీసులు అనుమానించారు.

స్టేడియంలో ఒక మూలన అతడిని చూసి పోలీసులు ప్రశ్నించగా తన గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నట్లు చెప్పాడు. అదే నంబర్‌కు మళ్లీ డయల్‌ చేయమని అడగ్గా, ఆ వ్యక్తి సరిగ్గా సమాధానమివ్వలేదు. అతడిని పట్టుకునే లోపే రెండు ఫోన్లను వదిలేసి పారిపోయాడు. మ్యాచ్‌ జరుగుతున్న అసలు సమయానికి, టీవీలో ప్రసారానికి మధ్య క్షణకాలపు విరామం ఉంటుంది. దీనిని వాడుకొని ప్రతీ బంతికి ఫిక్సింగ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే మరో కేసు విచారణ సందర్భంగా ఐపీఎల్‌ దొంగ అక్రిడేషన్లు పొందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు కేసులను ఒక చోటికి చేర్చి దీనిపై çపూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని షబ్బీర్‌ హుస్సేన్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు