Border-Gavaskar Trophy 2023: అసలు సిసలు ‘పరీక్ష’

9 Feb, 2023 05:09 IST|Sakshi

భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు

డబ్ల్యూటీసీ ఫైనల్‌ లక్ష్యంగా బరిలో టీమిండియా

శుభారంభంపై ఆసీస్‌ దృష్టి

ఉదయం గం.9:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

సమయం వచ్చేసింది... ధనాధన్‌ క్రికెట్‌ తరంలో టెస్టు క్రికెట్‌ను సజీవంగా నిలబెడుతూ అంతా ఎదురు చూస్తున్న పోరుకు రంగం సిద్ధమైంది... హోరాహోరీ సమరాలు, పోటాపోటీ మాటల తూటాలు, అగ్రశ్రేణి ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనలు, అనూహ్య మలుపులు, చిరస్మరణీయ ఫలితాలు... ఒకటేమిటి భారత్, ఆస్ట్రేలియా మధ్య పోరు అంటే అన్ని రకాల దినుసులతో కూడిన సంపూర్ణ భోజనం...

గత కొన్నేళ్లుగా టెస్టు క్రికెట్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లతో ‘యాషెస్‌’ను మించి అభిమానులను అలరిస్తున్న ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’ కోసం ఇరు జట్లు సమస్త అస్త్రాలు, సర్వ సన్నాహాలతో బరిలోకి దిగబోతున్నాయి. 33 రోజుల వ్యవధిలో సాగే ఈ నాలుగు టెస్టుల్లో తుది విజేతగా ఎవరు నిలిచినా... అభిమానులకు ఫుల్‌ వినోదం మాత్రం గ్యారంటీ!


 
నాగ్‌పూర్‌: తొలి వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు మరోసారి ఫైనల్‌కు అర్హత సాధించే లక్ష్యంతో సొంతగడ్డపై అత్యంత కీలక పోరుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో నేటి నుంచి జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా కనీసం మూడు మ్యాచ్‌లు గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

మరోవైపు ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరిన ఆసీస్‌ బృందం భారత గడ్డపై సిరీస్‌ గెలిచే ‘అత్యంత కఠిన ఆపరేషన్‌’ కోసం తమ సర్వశక్తులూ ఒడ్డనుంది. తమ దేశంలోనే వరుసగా రెండుసార్లు టీమిండియాకు సిరీస్‌లు కోల్పోయిన కంగారూ బృందం ఇక్కడ సత్తా చాటి ప్రతీకారం తీర్చుకోగలదా అనేది ఆసక్తికరం. స్వదేశంలో అసమాన రికార్డు, తాజా ఫామ్‌ చూస్తే భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... ఆస్ట్రేలియాలాంటి బలమైన జట్టును తక్కువగా అంచనా వేస్తే భంగపాటు తప్పదు.

 

కేఎస్‌ భరత్‌ అరంగేట్రం?
తుది జట్టులో కచ్చితంగా ఉండే ఆరుగురు కాకుండా మిగతా ఐదు స్థానాలకు జట్టులో పోటీ నెలకొని ఉంది. చివరి నిమిషంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరం.  రోహిత్, పుజారా, కోహ్లి, అశ్విన్, జడేజా, షమీ ఆడటం ఖాయం కాగా, వైస్‌ కెప్టెన్‌గా ఇప్పటికే రెండుసార్లు మీడియా సమావేశాలకు వచ్చిన కేఎల్‌ రాహుల్‌ స్థానానికి కూడా ఢోకా ఉండకపోవచ్చు.

రోహిత్‌కు ఓపెనింగ్‌ భాగస్వామిగా రాహులే బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే గాయంతో దూరమైన శ్రేయస్‌కు బదులుగా మిడిలార్డర్‌లో గిల్, సూర్యకుమార్‌లలో ఒకరినే ఎంచుకోవాల్సి ఉంటుంది. వన్డేలు, టి20ల్లో కలిపి గత ఏడు ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు చేసిన గిల్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి అతనికే తొలి ప్రాధాన్యత. సూర్యకుమార్‌ ప్రధానంగా టి20 ఫామ్‌తోనే టీమ్‌లోకి వచ్చాడు. అతని ఫస్ట్‌ క్లాస్‌ రికార్డు (45.93 సగటు) మరీ గొప్పగా ఏమీ లేదు.

అయితే పంత్‌ లేకపోవడంతో అతని తరహాలో తక్కువ సమయంలో ఎదురుదాడికి దిగి ప్రత్యర్థిని ఆత్మరక్షణలో పడేసే దూకుడు సూర్యలో ఉందని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. అలా చూస్తే సూర్య కీలకమవుతాడు. కీపర్‌ స్థానం కోసం ఆంధ్ర ఆటగాడు కోన శ్రీకర్‌ భరత్, ఇషాన్‌ కిషన్‌ మధ్య పోటీ ఉంది. ఎడంచేతి వాటం, ధాటి ఇషాన్‌ సొంతమైనా... ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అతని కీపింగ్‌ సామర్థ్యంపై సందేహాలు ఉన్నాయి.

మరోవైపు మూడో స్పిన్నర్‌గా అక్షర్‌ పటేల్‌ను ఆడిస్తారా లేక వైవిధ్యం కోసం కుల్దీప్‌ను తీసుకుంటారా చూడాలి. ఎంత స్పిన్‌ పిచ్‌ అయినా సరే నాలుగో స్పిన్నర్‌ ఆలోచన లేకపోవచ్చు. షమీతో పాటు సిరాజ్‌ బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువ. అశ్విన్, జడేజా చెలరేగితే ఆసీస్‌ బెంబేలెత్తిపోవడం ఖాయం.  

రెండో స్పిన్నర్‌ ఎవరు?
ఆస్ట్రేలియా టాప్‌–5 బ్యాటింగ్‌ లైనప్‌ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. భారత గడ్డపై టెస్టుల్లో పేలవమైన రికార్డు ఉన్న వార్నర్‌ ఈసారి దానిని చక్కదిద్దుకుంటాడా అనేది చూడాలి. ఎప్పటిలాగే స్మిత్‌ అసమాన బ్యాటింగ్‌పై ఆసీస్‌ ఆధారపడుతోంది. నాటి సిరీస్‌లో అతనికి మరే బ్యాటర్‌ నుంచి సహకారం లభించలేదు.

ఈసారి ఆ పాత్రను పోషించేందుకు దాదాపు స్మిత్‌లాంటి సామర్థ్యం ఉన్న లబుషేన్‌ సిద్ధంగా ఉన్నాడు. బౌలింగ్‌లో హాజల్‌వుడ్‌ దూరం కావడంతో కెప్టెన్‌ కమిన్స్‌పై బాధ్యత పెరిగింది. ప్రధాన స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ ఆ జట్టు కీలక అస్త్రం కాగా, అతనికి అండగా ఎవరు నిలుస్తారో చూడాలి. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ యాష్టన్‌ అగర్‌కంటే కొత్త ఆటగాడు మర్ఫీకి ఎక్కువ సానుకూలతలు ఉన్నాయి.  

తుది జట్లు (అంచనా):  
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్, పుజారా, కోహ్లి, గిల్‌/సూర్యకుమార్, జడేజా, అశ్విన్, భరత్, అక్షర్‌/కుల్దీప్, షమీ, సిరాజ్‌.  
ఆస్ట్రేలియా: కమిన్స్‌ (కెప్టెన్‌), వార్నర్, ఖాజా, లబుషేన్, స్మిత్, హెడ్, హ్యాండ్స్‌కోంబ్‌/రెన్‌షా, క్యారీ, అగర్‌/మర్ఫీ, లయన్, బోలండ్‌.

మరిన్ని వార్తలు