Border-Gavaskar Trophy: ‘జడ్డూ’ తిప్పేశాడు...

20 Feb, 2023 05:43 IST|Sakshi

7 వికెట్లతో మెరిసిన రవీంద్ర జడేజా

రెండో టెస్టులోనూ ఆసీస్‌ చిత్తు

టీమిండియా 6 వికెట్లతో జయభేరి

మన వద్దే ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’

మార్చి 1 నుంచి ఇండోర్‌లో మూడో టెస్టు

న్యూఢిల్లీ: భారత్‌కు అచ్చొచ్చిన ఢిల్లీ వికెట్‌పై పర్యాటక జట్టే స్పిన్‌తో అల్లాడిస్తే... ఆతిథ్య జట్టు అంతకుమించే చేయాలి కదా! సరిగ్గా... టీమిండియా కూడా అదే చేసింది. ఒక్క సెషన్‌ అయినా పూర్తిగా ఆడనివ్వకుండానే ఆస్ట్రేలియాను ఆలౌట్‌ చేసింది. రవీంద్ర జడేజా (7/42) బిగించిన ఉచ్చులో ఆస్ట్రేలియా క్లీన్‌బౌల్డయింది. 31.1 ఓవర్లలోనే 113 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. ఇందులో 12 ఓవర్లు, 61 పరుగులు క్రితం రోజువే కాగా... మూడో రోజు ఆసీస్‌ ఆడింది 19.1 ఓవర్లే! చేసింది కూడా 52 పరుగులే! అంటే సగటున ప్రతి రెండు ఓవర్లకు ఓ వికెట్‌ను సమర్పించుకుంది. అంతలా ప్రపంచ నంబర్‌వన్‌ టెస్టు జట్టు జడుసుకుంది. 

‘జడ్డూ’ ఏకంగా ఐదుగురు బ్యాటర్లను బౌల్డ్‌ చేశాడు. అనంతరం 115 పరుగుల సులువైన లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 26.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో రెండు జట్ల బౌలర్లు ఎక్స్‌ట్రాలు ఇవ్వకపోవడం విశేషం. మ్యాచ్‌ మొత్తం లో పది వికెట్లు తీయడంతోపాటు కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన జడేజాకు వరుసగా రెండోసారీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2–0తో ఉన్న భారత్‌ ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’ని తమ వద్దే అట్టిపెటుకుంది. క్రితంసారి కూడా భారతే గెలిచింది. ఇక ఈ సిరీస్‌లో మూడో టెస్టు మార్చి 1 నుంచి ఇండోర్‌లో జరుగుతుంది. ఇండోర్‌ టెస్టులోనూ భారత్‌ గెలిస్తే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా అర్హత సాధిస్తుంది.  

ఇలా మొదలై... అలా కూలింది!  
ఓవర్‌నైట్‌ స్కోరు 61/1తో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా పతనం తొలి ఓవర్‌ నుంచే మొదలైంది. ఓపెనర్‌ హెడ్‌ (46 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అశ్విన్‌ బౌలింగ్‌లో ఒక బౌండరీ కొట్టి ఆఖరి బంతికి అవుటయ్యాడు. కాసేపటికే సీనియర్‌ బ్యాటర్‌ స్మిత్‌ (19 బంతుల్లో 9; 1 ఫోర్‌) కూడా అతని బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికాడు. తర్వాత జడేజా మాయాజాలం మొదలవడంతో కొత్తగా ఇంకెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ లబుషేన్‌ (50 బంతుల్లో 35; 5 ఫోర్లు) సహా స్వల్ప వ్యవధిలో క్యారీ (7), కమిన్స్‌ (0), లయన్‌ (8), కున్‌మన్‌ (0)లను జడేజా క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. కచ్చితత్వం లేని స్వీప్‌ షాట్లు, అనవసరమైన రివర్స్‌ స్వీప్‌ షాట్లు ఆస్ట్రేలియన్ల కొంపముంచాయి. ప్రపంచంలో ఎక్కడైనా పేస్‌ బంతులు బ్యాటర్లను బెంబేలెత్తిస్తాయి. కానీ ఇక్కడ స్లో డెలివరీలకే విలవిలలాడారు.

దీంతో ఆదివారం ఆటలో 9 వికెట్లు చేతిలో ఉన్న ఆసీస్‌ కనీసం 20 ఓవర్లయినా ఆడలేకపోయింది. అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. స్పిన్‌ తిరగడంతో భారత ప్రధాన సీమర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌కు     బంతిని అప్పగించాల్సిన అవసరమే రాలేదు. లంచ్‌ బ్రేక్‌ అనంతరం సులువైన లక్ష్యఛేదనలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్‌ ఆడాడు. కానీ కేఎల్‌ రాహుల్‌ (1) తన వైఫల్యం కొనసాగించాడు. 100వ టెస్టు ఆడుతున్న పుజారా (74 బంతుల్లో 31 నాటౌట్‌; 4 ఫోర్లు) కుదురుగా ఆడగా, మధ్యలో విరాట్‌ కోహ్లి (31 బంతుల్లో 20; 3 ఫోర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (12)ల వికెట్లు కూలాయి. అప్పటికే టీమిండియా విజయతీరానికి దగ్గరవగా మిగతా లాంఛనాన్ని కోన శ్రీకర్‌ భరత్‌ (22 బంతుల్లో 23 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి పుజారా పూర్తి చేశాడు. 27వ ఓవర్‌ వేసిన మర్పీ బౌలింగ్‌లో నాలుగో    బంతిని పుజారా మిడ్‌ వికెట్‌ మీదుగా బౌండరీకి తరలించి భారత్‌ను గెలిపించాడు.  

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 263; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 262;
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: ఉస్మాన్‌ ఖాజా (సి) శ్రేయస్‌ అయ్యర్‌ (బి) జడేజా 6; ట్రవిస్‌ హెడ్‌ (సి) శ్రీకర్‌ భరత్‌ (బి) అశ్విన్‌ 43; లబుషేన్‌ (బి) జడేజా 35; స్మిత్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్‌ 9; రెన్‌షా (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్‌ 2; హ్యాండ్స్‌కాంబ్‌ (సి) కోహ్లి (బి) జడేజా 0; క్యారీ (బి) జడేజా 7; కమిన్స్‌ (బి) జడేజా 0; లయన్‌ (బి) జడేజా 8; మర్ఫీ (నాటౌట్‌) 3; కున్‌మన్‌ (బి) రవీంద్ర జడేజా 0; మొత్తం (31.1 ఓవర్లలో ఆలౌట్‌) 113.
వికెట్ల పతనం: 1–23, 2–65, 3–85, 4–95, 5–95, 6–95, 7–95, 8–110, 9–113, 10–113.
బౌలింగ్‌: అశ్విన్‌ 16–3–59–3, మొహమ్మద్‌ షమీ 2–0–10–0, రవీంద్ర జడేజా 12.1–1–42–7, అక్షర్‌ పటేల్‌ 1–0–2–0.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (రనౌట్‌) 31; కేఎల్‌ రాహుల్‌ (సి) అలెక్స్‌ క్యారీ (బి) లయన్‌ 1; చతేశ్వర్‌ పుజారా (నాటౌట్‌) 31; విరాట్‌ కోహ్లి (స్టంప్డ్‌) క్యారీ (బి) మర్ఫీ 20; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) మర్ఫీ (బి) నాథన్‌ లయన్‌ 12; శ్రీకర్‌ భరత్‌ (నాటౌట్‌) 23; మొత్తం (26.4 ఓవర్లలో 4 వికెట్లకు) 118.
వికెట్ల పతనం: 1–6, 2–39, 3–69, 4–88.
బౌలింగ్‌: కున్‌మన్‌ 7–0–38–0, నాథన్‌ లయన్‌ 12–3–49–2, టాడ్‌ మర్ఫీ 6.4–2–22–1, ట్రవిస్‌ హెడ్‌ 1–0–9–0.  

100: అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌లలో కలిపి ఆస్ట్రేలియాపై భారత్‌కిది 100వ విజయం. మూడు ఫార్మాట్‌లలో రెండు జట్ల మధ్య 273 మ్యాచ్‌లు జరిగాయి. ఆసీస్‌తో 104 టెస్టులు ఆడిన భారత్‌ 32 విజయాలు అందుకొని, 43 పరాజయాలు చవిచూసింది. ఒక మ్యాచ్‌ ‘టై’కాగా, 28 ‘డ్రా’గా ముగిశాయి. 143 వన్డేల్లో టీమిండియా 53 మ్యాచ్‌ల్లో గెలిచి, 80 మ్యాచ్‌ల్లో ఓడింది. 10 మ్యాచ్‌లు రద్దయ్యాయి. 26 టి20 మ్యాచ్‌ల్లో భారత్‌ 15 విజయాలు సాధించి, 10 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్‌ రద్దయింది.

25012: అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌ (టెస్టు, వన్డే, టి20)లలో కలిపి కోహ్లి సాధించిన పరుగులు (492 మ్యాచ్‌లు). సచిన్‌ (664 మ్యాచ్‌ల్లో 34, 357 పరుగులు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ క్రికెటర్‌ కోహ్లి కాగా... 25 వేల పరుగులు సాధించిన క్రికెటర్ల జాబితా లో కోహ్లి ఆరో స్థానంలో ఉన్నాడు.

8: సొంతగడ్డపై టెస్టుల్లో జడేజాకిది ఎనిమిదో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు. భారత్‌ తరఫున అనిల్‌ కుంబ్లే (9 సార్లు) ‘టాప్‌’లో ఉండగా, సచిన్‌ (8 సార్లు) సరసన జడేజా నిలిచాడు.
సిరాజ్, కోహ్లి, భరత్, జడేజా, అక్షర్‌ పటేల్‌

>
మరిన్ని వార్తలు