‘పింక్‌’ సమరం...

17 Dec, 2020 02:29 IST|Sakshi

నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు

గులాబీ బంతితో డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌

శుభారంభంపై టీమిండియా దృష్టి

విహారి, పృథ్వీ షా, సాహాలకు చోటు

ఆసీస్‌ పర్యటనలో కోహ్లికి చివరి మ్యాచ్‌

ఉదయం గం. 9:30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అసలు సమరానికి సమయం ఆసన్నమైంది. సంప్రదాయ టెస్టు క్రికెట్‌లో ప్రస్తుతం సమఉజ్జీల్లాంటి రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాను సొంతగడ్డపైనే ఓడించి చరిత్ర సృష్టించిన భారత జట్టు ఇప్పుడు అదే బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీని నిలబెట్టుకునేందుకు అంతే ఉత్సాహంతో మళ్లీ బరిలోకి దిగుతోంది. అయితే అప్పటి ఆసీస్‌ జట్టు లెక్క వేరు... ఇప్పుడు బలం పెరిగిన కంగారూల జట్టు వేరు. ఈ ఫార్మాట్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న టిమ్‌ పైన్‌ బృందం మరోసారి ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా చెలరేగి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో హోరాహోరీ ఖాయం కాగా ఇరు జట్ల మధ్య తొలి డే అండ్‌ నైట్‌ టెస్టుతో అడిలైడ్‌ టెస్టుకు మరింత ఆకర్షణ పెరిగింది.

అడిలైడ్‌: వన్డేలు, టి20ల్లో సమంగా నిలిచిన తర్వాత భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇక టెస్టుల్లో సత్తా చాటేందుకు ‘సై’ అంటున్నాయి. బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా నేటి నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. అడిలైడ్‌ వేదికగా జరుగుతున్న ఈ పోరును గులాబీ బంతితో డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌గా నిర్వహించనుండటం విశేషం. గత పర్యటనలో ఇక్కడ సిరీస్‌ గెలిచిన టీమిండియా ఆ ఘనతను కొనసాగించాలంటే శుభారంభం తప్పనిసరి. భార్య ప్రసవం కారణంగా ఈ మ్యాచ్‌ ముగిశాక కెప్టెన్‌ కోహ్లి స్వదేశానికి తిరిగి రానున్న నేపథ్యంలో అతడి నాయకత్వంలో ఈ టెస్టు జట్టుకు కీలకంగా మారింది.

ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో...
ఆశ్చర్యకరంగా మ్యాచ్‌కు రోజు ముందే భారత మేనేజ్‌మెంట్‌ తమ తుది జట్టును ప్రకటించింది. రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లలోనూ ఆకట్టుకోలేకపోయిన పృథ్వీ షాకు మయాంక్‌తో జతగా ఓపెనింగ్‌ చేసే అవకాశం దక్కడం విశేషం. తాజా ఫామ్‌ ప్రకారం శుబ్‌మన్‌ గిల్‌ అరంగేట్రం చేయవచ్చని భావించినా... పృథ్వీపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకముంచింది. తనదైన స్ట్రోక్‌ ప్లేతో అతను దూకుడైన ఆరంభం ఇవ్వగలడని భారత్‌ భావిస్తూ ఉండవచ్చు. అదే విధంగా బ్యాటింగ్‌లో పంత్‌దే పైచేయిగా ఉన్నా... వికెట్‌ కీపింగ్‌లో తిరుగులేని సాహాకే జట్టు ఓటేసింది. డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లో బంతి గమనం కీపర్‌ను కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండటంతో పంత్‌కంటే ఎంతో మెరుగైన సాహాకు అవకాశం లభించింది.

మరోవైపు జడేజాలాంటి ఆల్‌రౌండర్‌ను కాదని ఆరో నంబర్‌ బ్యాట్స్‌మన్‌గా ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతని చక్కటి టెక్నిక్, సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో నిలబడగల నైపుణ్యం, గత ఆస్ట్రేలియా పర్యటనలో రాణించిన అనుభవంతో పాటు అవసరమైతే పార్ట్‌ టైమ్‌ ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ వేయగల సామర్థ్యంతో విహారి ఎంపికయ్యాడు. సీనియర్‌ ఇషాంత్‌ శర్మ లేకపోవడంతో ఊహించినట్లుగా షమీ, బుమ్రా, ఉమేశ్‌లతో భారత పేస్‌ దళం బరిలోకి దిగుతోంది. ప్రధాన స్పిన్నర్‌గా సీనియర్‌ అశ్విన్‌ జట్టులోకి వచ్చాడు. తాను బరిలోకి దిగుతున్న ఏకైక టెస్టులో నాయకుడిగా, బ్యాట్స్‌మన్‌గా కూడా కోహ్లి సత్తా చాటాల్సి ఉంది. అతనితో పాటు ప్రధానంగా పుజారా, రహానే బ్యాటింగ్‌ నైపుణ్యంపైనే ఈ సిరీస్‌ ఫలితం ఆధారపడి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. గులాబీ బంతితో మన పేసర్లు ఎలా బౌలింగ్‌ చేస్తారనేది ఆసక్తికరం.

బర్న్స్‌కు అవకాశం
ఆస్ట్రేలియా జట్టు టాపార్డర్‌ పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. గాయంతో వార్నర్‌ దూరం కాగా అతని స్థానంలో ఆడాల్సిన పకోవ్‌స్కీ కూడా గాయపడటంతో పరిస్థితి మరింత దిగజారింది. దాంతో కొత్త ఆటగాడిని ఓపెనర్‌గా ప్రయత్నించే బదులు ఎంతో కొంత అనుభవం ఉన్న (21 టెస్టులు) జో బర్న్స్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేసింది. ఈ సీజన్‌లో 9 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో కలిపి కేవలం 6.89 సగటుతో 62 పరుగులే చేసి ఘోరమైన ఫామ్‌లో ఉన్నా... బర్న్స్‌ తప్ప ఆసీస్‌కు మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు. రెండో ఓపెనర్‌గా మాథ్యూ వేడ్‌ ఆడటం ఖాయమైంది. అయితే ఆసీస్‌ బ్యాటింగ్‌ బలమంతా ఇద్దరు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌లోనే ఉంది. వరల్డ్‌ నంబర్‌వన్‌ స్టీవ్‌ స్మిత్‌తో పాటు లబ్‌షేన్‌ మ్యాచ్‌ను ఒంటిచేత్తో తమవైపు తిప్పగల సమర్థులు. భారత్‌ వీరిద్దరిని నిలువరించాల్సి ఉంది. స్మిత్‌కు వెన్ను నొప్పి సమస్య లేదని, అతను బరిలోకి దిగుతున్నాడని ఆసీస్‌ ప్రకటించింది. పింక్‌ బాల్‌తో మంచి అనుభవం ఉన్న పేస్‌ త్రయం స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్‌లు టెస్టును శాసించగలరు. స్పిన్నర్‌ లయన్‌ కూడా ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌తో ఆల్‌రౌండర్‌ గ్రీన్‌ అరంగేట్రం చేస్తున్నాడు. సొంత మైదానంలో ఆడటంతో పాటు డే–నైట్‌ టెస్టుల అనుభవం ఉన్న ఆసీస్‌దే ప్రత్యర్థితో పోలిస్తే ఒకింత పైచేయిగా కనిపిస్తోంది.

పిచ్, వాతావరణం
గులాబీ బంతి ఎక్కువసేపు మన్నికగా ఉండేందుకు సాధారణంగా పింక్‌ టెస్టుల్లో పిచ్‌పై ఎక్కువ పచ్చికను ఉంచుతారు. ఫలితంగా ఆరంభంలో బంతి పేసర్లకు బాగా అనుకూలిస్తుంది. చిరు జల్లులకు అవకాశం ఉన్నా... మ్యాచ్‌పై ప్రభావం ఉండకపోవచ్చు.

జట్ల వివరాలు
భారత్‌ (తుది జట్టు): కోహ్లి (కెప్టెన్‌), మయాంక్, పృథ్వీ షా, పుజారా, రహానే, విహారి, సాహా, అశ్విన్, షమీ, ఉమేశ్, బుమ్రా.  
ఆస్ట్రేలియా (అంచనా): పైన్‌ (కెప్టెన్‌), బర్న్స్, వేడ్, లబ్‌షేన్, స్మిత్, హెడ్, గ్రీన్, కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్, లయన్‌.

14: అంతర్జాతీయ పురుషుల క్రికెట్‌లో ఇప్పటివరకు జరిగిన డే–నైట్‌ టెస్టుల సంఖ్య. అన్నింట్లోనూ ఫలితాలు వచ్చాయి.
7: ఆస్ట్రేలియాలో జరిగిన డే–నైట్‌ టెస్టులు. అన్నింటా ఆస్ట్రేలియా జట్టే గెలిచింది.
1:భారత్‌ ఒకే డే–నైట్‌ టెస్టు (2019లో బంగ్లాదేశ్‌తో) ఆడి విజయం సాధించింది.

కరోనా కారణంగా అందరికీ వాస్తవాలు అర్థమై ప్రాధాన్యతలు మారిపోయాయనేది నా అభిప్రాయం. పాత తరహాలో వ్యక్తిగతంగా కొందరి పట్ల ద్వేషం చూపించడంలో అర్థం లేదని అంతా అనుకుంటున్నారు. ఆసీస్‌ ఆటగాళ్ల వ్యవహార శైలిలో మార్పు రావడంతోపాటు ఐపీఎల్‌లో కలిసి ఆడటం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. ఏదైనా అంతా ప్రొఫెషనల్‌గానే సాగుతుంది. పరుగులు సాధించడంలో, ప్రత్యర్థి వికెట్లు తీయడంలో దూకుడు లోటు ఏమీ ఉండదు కానీ అనవసరపు అంశాలు మాత్రం వడబోసి పక్కన పడేయడం ఖాయం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు మైదానంలో దిగి క్రికెట్‌ ఆడటమే గొప్ప అదృష్టంగా భావిస్తున్నారు. అలాంటప్పుడు ఇతర అంశాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. అయితే క్రికెట్‌ నాణ్యత విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడబోం. ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శనను మీరు చూస్తారు. ఎలాంటి సవాల్‌నైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉండే కొత్త తరం భారత దేశానికి నేను ప్రతినిధిని. నేను ఎప్పుడైనా నాలాగే ఉండేందుకు ప్రయత్నిస్తా. ఆస్ట్రేలియన్ల మానసిక దృక్పథంతో నన్ను పోల్చడం అనవసరం. నేను నేనే. భారతీయుడినే. నేను స్వదేశం వెళ్లాక రహానే కెప్టెన్సీని అద్భుతంగా నిర్వర్తిస్తాడని నమ్మకంతో ఉన్నాను.    
–కోహ్లి, భారత కెప్టెన్‌

మరిన్ని వార్తలు