IPL 2023:'అతడు ఏదో పెద్ద స్టార్‌ క్రికెటర్‌లా ఫీలవుతున్నాడు.. గిల్‌ను చూసి నేర్చుకో'

28 May, 2023 13:13 IST|Sakshi
PC: IPL.com

ఐపీఎల్‌-2023లో టీమిండియా యువ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యాడు. ఈ ఏడాది సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన షా కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో కేవలం ఒక హాఫ్‌ సెంచరీ మాత్రమే ఉంది.దీంతో భారత టీ20 జట్టులోకి వచ్చే ఛాన్స్‌లను పృథ్వీ షా సంక్లిష్టం చేసుకున్నాడు. ఇక దారుణమైన ప్రదర్శన కనబరిచిన షాపై భారత మాజీ పేసర్ కర్సన్ ఘావ్రీ విమర్శల వర్షం కురిపించాడు.

పృథ్వీ షాను తన సహచర ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌తో పోలుస్తూ ఘావ్రీ చురకలు అంటించాడు. కాగా గిల్‌, పృథ్వీ షా ఇద్దరూ భారత్‌ తరపున అండర్‌-19 ప్రపంచకప్‌లో కలిసి ఆడారు. ఇక గిల్‌ ఈ ఏడాది ఐపీఎల్‌లో అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 16 మ్యాచ్‌లు ఆడిన గిల్‌ 851 పరుగులతో  ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్‌లలో నాలుగు హాఫ్‌ సెంచరీలతో పాటు మూడు సెంచరీలు ఉన్నాయి.

ఏదో పెద్ద స్టార్‌ క్రికెటర్‌లా..
"2018 అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో పృథ్వీ షా, గిల్‌ భాగంగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఆడారు. అయితే ఈ రోజు శుబ్‌మన్‌ గిల్‌ ఏ స్థితిలో ఉన్నాడు, పృథ్వీ షా ఏ పోజేషన్‌లో ఉన్నాడు మీరే చూడండి. ఇద్దరూ వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్నారు.

నిరంతరం కష్టపడితేనే ఈ ఫీల్డ్‌లో నిలదొక్కకుంటారు. ఇద్దరు ఒకే వయస్సుకు చెందినవారు. కాబట్టి ఇప్పటికీ అయిపోయింది ఏమీ లేదు. గిల్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌లో కూడా చాలా లోపాలు ఉండేవి. కానీ గిల్‌ కష్టపడి వాటిని సరిదిద్దు కున్నాడు. పృథ్వీ షా మాత్రం అలా చేయలేదు. ఇప్పటికీ అతడి బ్యాటింగ్‌ టెక్నిక్‌లో చాలా లోపాలు ఉన్నాయి.

అతడు తను ఎదో పెద్ద స్టార్‌ క్రికెటర్‌ అని, తనని ఎవరూ టచ్ చేయలేరని షా అనుకుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో గాని, రంజీట్రోఫీలో గాని ఏ లీగ్‌లోనైనా మనం ఔట్‌ కావడానికి ఒక బంతి చాలు అని అతడు గ్రహించాలి. ఈ జెంటిల్‌మెన్‌ గేమ్‌లో రాణించాలంటే నిబద్దతతో పాటు క్రమశిక్షణ ఉండాలి అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో  ఘవ్రీ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: సూర్యను చూసి నేర్చుకో.. నాకు దాదా ఆరోజు అలా చెప్పాడు.. తిలక్‌ నువ్వు కూడా!
 

మరిన్ని వార్తలు