-

బాక్సింగ్‌ డే టెస్టు: అంపైర్స్‌ కాల్‌పై సచిన్‌ అసహనం

28 Dec, 2020 14:08 IST|Sakshi

డీఆర్‌ఎస్‌ విధానంపై కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: డీఆర్‌ఎస్‌ విధానంలో ‘అంపైర్స్‌ కాల్‌’ నిబంధన పట్ల క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అసహనం వ్యక్తం చేశాడు. ‘అంపైర్‌ నిర్ణయంపై సంతృప్తి లేకనే డీఆర్‌ఎస్‌ను ఆశ్రయిస్తారు ఆటగాళ్లు. మరి ఆ నిర్ణయాన్ని సమీక్షించి నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన థర్డ్‌ అంపైర్‌.. తను ఎటూ తేల్చలేక మళ్లీ అంపైర్‌ అభిప్రాయానికే వదిలేస్తే.. లాభం ఏముంటుంది’అని సచిన్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. డీఆర్‌ఎస్‌ విధానంపై ముఖ్యంగా ‘అంపైర్స్‌ కాల్‌’ అంశంపై దృష్టి సారించాలని ట్విటర్‌ వేదికగా అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ను కోరాడు. కాగా, బాక్సింగ్‌ డే టెస్టులో ఎల్బీగా ఔట్‌ కావాల్సిన లబుషేన్‌, జో బర్న్స్‌ ఈ నియమం వల్ల బతికిపోయారు. టీమిండియా ఆటగాళ్ల అప్పీల్‌ను అంపైర్‌ తోసిపుచ్చడంతో.. కెప్టెన్‌ రహానే డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. అయినా, ఫలితం లేకపోయింది. 
(చదవండి: బాక్సింగ్‌ డే టెస్టు: విజయావకాశాలు మనకే!)

బంతి వెళ్తున్న దశేమిటో స్పష్టత లేకపోవడంతో థర్డ్‌ అంపైర్‌ పాల్‌ విల్సన్‌ అంపైర్‌ అభిప్రాయానికే నిర్ణయాన్ని వదిలేశాడు. దాంతో వారిద్దరూ సేవ్‌ అయ్యారు. అయితే, బంతి మాత్రం సరైన దిశలోనే వికెట్లపైకి వెళ్లిందని రీప్లేలో తెలుస్తోంది. మరోవైపు డీఆర్‌ఎస్‌ ద్వారా సరైన నిర్ణయం రాకపోవడం.. అంపైర్‌ అభిప్రాయానికే నిర్ణయాలను వదిలేయడంపై టీమిండియా ఆటగాళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్‌ అభిమానులు, విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు.  ఇక తాజా మ్యాచ్‌ విషయానికొస్తే తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 195 పరుగులకే ఆలౌట్‌ చేసిన టీమిండియా, రెండో ఇన్సింగ్స్‌లో 326 పరుగులు చేసి 131 ఆదిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను మరోమారు భారత బౌలర్లు బెంలేలెత్తించారు. 133 పరుగులకే కీలకమైన ఆరు వికెట్లు పడగొట్టారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 2 పరుగుల ఆదిక్యంలో ఉంది. టెయిలెండర్లు కామెరూన్‌ గ్రీన్‌ (17), పాట్‌ కమిన్స్‌ (15) క్రీజులో ఉన్నారు.
(చదవండి: బాక్సింగ్‌ డే టెస్టు: 2 పరుగుల ఆదిక్యంలో ఆసీస్‌)

మరిన్ని వార్తలు