Mike Tyson: వీల్‌చైర్‌లో మైక్ టైసన్.. బాక్సింగ్‌ దిగ్గజానికి ఏమైంది..?

18 Aug, 2022 11:51 IST|Sakshi

దిగ్గజ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ గురించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ పాన్‌ ఇండియా మూవీ 'లైగర్‌'లో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం వరకు సినిమా ప్రమోషన్స్‌లో బిజిబిజీగా గడిపిన మైక్‌ టైసన్.. తాజాగా వీల్‌చైర్లో కూర్చొని కదలలేని పరిస్థితిలో కనిపించిన దృశ్యాలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఈ ఫొటోలు చూసిన అభిమానులు లెజెండరీ బాక్సర్‌కు ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు. లైగర్‌ షూటింగ్‌లో హుషారుగా కనిపించిన యోధుడు కర్ర పట్టుకు కూర్చొని, ఇతరుల సాయంతో ముందుకు కదులుతున్న దృశ్యాలను చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. 

ఈ దృశ్యాలు టైసన్‌ మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో నుంచి బయటకు వస్తున్నప్పుడు తీసినవిగా చెబుతున్నారు. టైసన్‌ ఈ పరిస్థితిలో ఉన్నప్పటికీ కొందరు సెల్ఫీల కోసం ఎగబడిన వైనం విస్మయానికి గురి చేస్తుంది. టైసన్‌ ఈ స్థితిపై ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. టైసన్‌ గతకొంతకాలంగా వెన్నునొప్పి, సయాటికాతో బాధపడుతున్నట్లు తెలిసింది. డాక్టర్లు టైసన్‌ను వీల్‌ చైర్‌ వాడాలని సూచించారట. 

విషయం తెలుసుకున్న అభిమానులు.. ప్రపంచాన్ని ఏలిన దిగ్గజ బాక్సర్‌కు ఈగతి పట్టిందేనని వాపోతున్నారు. 56 ఏళ్ల టైసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎక్స్‌పైరీ డేట్‌కు దగ్గర పడుతున్నానని చెప్పిన మాటల గురించి ప్రస్తుతం జనం చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే, విజయ్‌ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం లైగర్ ఈనెల (ఆగస్టు) 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం​ తెలిసిందే. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా బాలీవుడ్‌ క్యూటీ అనన్య పాండే నటించగా.. టైసన్‌ కీ రోల్‌ పోషించాడు. 

ఇక మైక్‌ టైసన్‌ ప్రొఫెషనల్‌ కెరీర్‌ విషయానికొస్తే.. టైసన్‌ ఇరవై ఏళ్ల వయసుకే తన దూకుడుతో ప్రపంచ ఛాంపియన్‌గా ఎదిగాడు. జూన్‌ 30, 1966లో జన్మించిన టైసన్‌.. చిన్నవయసులోనే అమెరికన్‌ ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా ఎదిగాడు. బాల్యంలో ఎన్నో కష్టాలు, వేధింపులు ఎదుర్కొన్న టైసన్‌.. స్ట్రీట్‌ఫైట్లలో పాల్గొని జైలు పాలయ్యాడు. లైంగి​క వేధింపులు, ఇతరత్రా వివిదాల కారణంగా అతను 38సార్లు జైలుకెళ్లాడు. టైసన్‌ జైల్లో ఉండగానే బాక్సింగ్‌ దిగ్గజం ముహమ్మద్‌ అలీని కలిశాడు. 1997లో ప్రత్యర్థి ఇవాండర్‌ హోలిఫీల్డ్‌ చెవి కొరికి 3 మిలియన్‌ డాలర్ల జరిమానా చెల్లించాడు. టైసన్‌ కెరీర్‌ రికార్డు 50 విజయాలు-20 ఓటములుగా ఉంది.


చదవండి: విజయ్‌ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్‌ తీసుకున్న మైక్‌ టైసన్‌.. ఎంతంటే

మరిన్ని వార్తలు