‘బాగా ఆడింది వారైతే నాకెందుకు ఆ క్రెడిట్‌‌’

24 Jan, 2021 17:34 IST|Sakshi

బెంగళూరు: ఇటీవల ఆసీస్‌ గడ్డపై టీమిండియా సాధించిన సంచలన విజయాల్లో కీలక పాత్ర పోషించిన యువ ఆటగాళ్లను భారత జట్టు మాజీ సారధి, ప్రస్తుత భారత అండర్‌-19, ఇండియా-ఏ జట్ల కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఆకాశానికెత్తాడు. ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో యువ ఆటగాళ్లు రిషబ్ పంత్‌, మహమ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణించి టీమిండియాకు చారిత్రక సిరీస్‌ విజయాన్ని అందించారు. వారి ఆ స్థాయి ప్రదర్శన వెనుక 'ది వాల్‌' రాహుల్‌ ద్రవిడ్‌ కృషి ఉందన్నది బహిరంగ రహస్యమే అయినప్పటికీ.. రాహుల్‌ మాత్రం దాంతో ఏకీభవించడం లేదు. సీనియర్‌ ఆటగాళ్ల గైర్హాజరీలో కుర్రాళ్లు చేసిన అద్భుత ప్రదర్శనకు క్రెడిట్‌ మొత్తం వారికే దక్కాలని ఓ స్పోర్ట్స్‌ చానెల్‌ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మైదానంలో కుర్రాళ్లు చూపిన తెగువ, ధైర్యం, ఆట పట్ల నిబద్ధత ఎంతో అద్భుతమని, వారి వ్యక్తిగత ప్రతిభ కారణంగానే కుర్రాళ్లు ఈ స్థాయికి చేరారని ద్రవిడ్‌ ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రస్తుత సీనియర్‌ జట్టులో సభ్యులైన కుర్రాళ్లకు అండర్‌-19 జట్టు సభ్యులుగా ఉన్నప్పుడు తాను కోచింగ్‌ ఇచ్చానన్న కారణంగా కుర్రాళ్లు సాధించిన ఘనతను తనకు ఆపాదించడం సమంజసం కాదని అన్నాడు. క్రెడిట్‌ మొత్తానికి వారు మాత్రమే అర్హులని పేర్కొన్నాడు. కాగా, యువకుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసి, ఆటలో వారికి మెళకువలు నేర్పించి, కుర్రాళ్ల అద్భుత ప్రదర్శనకు కారకుడైన ద్రవిడ్‌పై యావత్‌ క్రికెట్‌ ప్రపంచం మొత్తం ప్రశంసల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ద్రవిడ్‌ పైవిధంగా స్పందించాడు.
 

మరిన్ని వార్తలు