పంత్‌ వాళ్ల స్థానాన్ని భర్తీ చేస్తాడు: బ్రాడ్‌ హాగ్‌

23 Jan, 2021 20:19 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హాగ్‌ టీమిండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌పై ప్రశంసలు కురిపించాడు. విభిన్న రకాల షాట్లతో విరుచుకుపడే పంత్‌కు బౌలింగ్‌ చేయడం కష్టమని, ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మరోసారి సత్తా చాటాడని కొనియాడాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ ఈ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ మెరుగ్గా రాణించగలడని, అతడిని జట్టులో తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సెలక్టర్లకు సూచించాడు. శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌ స్థానానికి అతడితో ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా సిడ్నీ టెస్టులో రిషభ్‌ పంత్‌ 97 పరుగులు చేసిన విషయం తెలిసిందే. తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. ఒత్తిడి అధిగమించి జట్టు మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు. (చదవండి: అతడితో నన్ను పోల్చడం అద్భుతం కానీ..: పంత్‌)

ఇక నిర్ణయాత్మక బ్రిస్బేన్‌ టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి, చారిత్రక విజయంలో హీరోచిత ఇన్నింగ్స్‌తో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్’‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో పంత్‌ ప్రదర్శన గురించి మాట్లాడిన స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌.. ‘‘ఇప్పుడు తను పూర్తి విశ్వాసంతో ముందుకు సాగుతాడు. టెస్టు సిరీస్‌లోని రెండు కీలక మ్యాచుల్లో తనను తాను నిరూపించుకున్నాడు. ఆసీస్‌ గడ్డపై మరే ఇతర భారత ఆటగాడు ఇంతకంటే మెరుగ్గా ఆడలేడు. తను అయ్యర్‌ లేదా సంజూ శాంసన్‌ స్థానాన్ని భర్తీ చేస్తాడు. ఇక కోహ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘కోహ్లి కెప్టెన్‌గా ఉంటేనే తన బ్యాటింగ్‌ మెరుగ్గా ఉంటుంది. లేదంటే జట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిజానికి అజింక్య రహానే ఆసీస్‌పై టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా అద్భుతంగా రాణించాడు. కూల్‌గా తన పని తాను చేసుకుపోయాడు. గొప్ప సారథి తను. అయితే కోహ్లి జట్టును ముందుండి నడిపిస్తాడు కాబట్టి తను వైస్‌ కెప్టెన్‌గానే ఉంటాడు’’ అని ఈ ఆసీస్‌ స్పిన్నర్‌ చెప్పుకొచ్చాడు.(చదవండివాళ్లిద్దరూ పట్టుదలగా నిలబడ్డారు: జడేజా)

మరిన్ని వార్తలు