పాక్‌ క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌

13 May, 2023 14:59 IST|Sakshi

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తమ పురుషుల జట్టు హెడ్‌ కోచ్‌గా న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ గ్రాంట్ బ్రాడ్‌బర్న్‌ను నియమించింది. వచ్చే రెండేళ్ల పాటు బ్రాడ్‌బర్న్‌ పాకిస్థాన్‌ జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా సేవలందించనున్నాడు. ఈ విషయాన్ని పీసీబీ ఇవాళ (మే 13) అధికారికంగా ప్రకటించింది. బ్రాడ్‌బర్న్.. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో కన్సల్టెన్సీ ప్రాతిపదికన పాక్‌ ప్రధాన కోచ్‌గా పని చేశాడు.

దీనికి ముందు బ్రాడ్‌బర్న్‌ స్కాట్లాండ్‌ జట్టు ప్రధాన కోచ్‌గా, 2018 నుండి 2020 వరకు పాకిస్తాన్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు.హెడ్‌ కోచ్‌ పదవితో పాటు పీసీబీ మరో రెండు ఖాళీలను సైతం భర్తీ చేసింది. బ్యాటింగ్‌ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఆండ్రూ పుట్టిక్‌ (రెండేళ్ల పాటు)ను, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా డ్రికస్ సైమాన్‌ను నియమించింది. అలాగే క్లిఫ్ డీకన్‌ను ఫిజియోథెరపిస్ట్‌గా కొనసాగించింది. 

ఇదిలా ఉంటే, బ్రాడ్‌బర్న్ తాత్కాలిక హెడ్‌ కోచ్‌గా వ్యవహరించిన పీరియడ్‌లో పాకిస్తాన్.. న్యూజిలాండ్‌తో  జరిగిన టీ20 సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుని, వన్డే సిరీస్‌ను 4-1 కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో నాలుగో వన్డే అనంతరం పాక్‌ తొలిసారిగా వన్డేల్లో టాప్‌ ర్యాంక్‌కు చేరుకుంది. 

చదవండి: World Cup 2023: భారత్‌లో అడుగుపెట్టేందుకు పాక్‌ ప్రభుత్వం ఒప్పుకోదు..!

మరిన్ని వార్తలు