FIFA WC: బ్రెజిల్‌ను గెలిపించినోడు.. పొట్టకూటి కోసం ఐస్‌క్రీంలు అమ్మి

25 Nov, 2022 16:02 IST|Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో గురువారం రాత్రి సెర్బియాతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్‌ 2-0 తేడాతో ఘన విజయం సాధించింది. అయితే బ్రెజిల్‌ స్టార్‌ నెయ్‌మర్‌ గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో బ్రెజిల్‌ను ఎవరు ముందుండి నడిపిస్తారనే సంశయం మొదలైంది. కానీ నెయ్‌మర్‌ స్థానంలో వచ్చిన రిచర్లీసన్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

బ్రెజిల్‌ చేసిన రెండు గోల్స్‌ రిచర్లీసన్‌ కొట్టినవే కావడం విశేషం. అతను కొట్టిన రెండు గోల్స్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఇప్పుడు 25 ఏళ్ల రిచర్లీసన్‌ పేరు ఫిఫా వరల్డ్‌కప్‌లో మారుమోగిపోతుంది.  ఇప్పటికే ఐదుసార్లు ఛాంపియన్‌ అయిన బ్రెజిల్‌కు ఆరో టైటిల్‌ అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రిచర్లీసన్‌ మ్యాచ్‌ అనంతరం పేర్కొన్నాడు.

అయితే రిచర్లీసన్‌ అనుకున్నంత ఈజీగా ఫుట్‌బాలర్‌ అవ్వలేదు. ఫుట్‌బాలర్‌ అవ్వడానికి ముందు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఇప్పుడు స్టార్‌గా పేరు సంపాదించినప్పటికి ఒకప్పుడు పొట్టకూటి కోసం ఐస్‌క్రీంలు అమ్మాడు.. చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. రిచర్లీసన్‌ తండ్రి ఓ మేస్త్రీ. తల్లి ఐస్‌ క్యాండీలు అమ్ముతుండేది. ఆమెతోపాటు అతడు కూడా వెళ్లి అవి అమ్మేవాడు. డ్రగ్స్‌కు మారు పేరుగా నిలిచే బ్రెజిల్‌లోని నోవా వెనేసియా అనే ఏరియాలో పుట్టి పెరిగాడు. ఐదుగురు సంతానంలో అందరి కంటే పెద్దవాడు. తినడానికి తిండి లేక ఖాళీ కడుపుతో పడుకున్న రోజులు ఉన్నాయి. తన స్నేహితులు డ్రగ్స్‌ అమ్ముతూ సులువుగా డబ్బు సంపాదిస్తున్నా.. అది తప్పని తెలిసి దానికి దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.

ఒకసారి డ్రగ్స్‌ వ్యాపారం చేసే వ్యక్తి ఒకరు అతని తలకు తుపాకీ గురి పెట్టాడట. తన నుంచి డ్రగ్స్‌ దొంగిలించిన వాళ్లలో తననూ ఒకడిగా భావించి అతడలా చేసినట్లు రిచర్లీసన్‌ చెప్పాడు. "ఆ సమయంలో చాలా భయపడ్డాను. ట్రిగ్గర్‌ నొక్కితే నా పనైపోయేది. కానీ మరోసారి ఇక్కడ కనిపిస్తే చంపేస్తానని బెదిరించి వదిలేశాడు. అలా చావు అంచుల వరకు వెళ్లి తప్పించుకున్నాం" అని చెప్పుకొచ్చాడు.

అప్పటికి రిచర్లీసన్‌ వయసు 14 ఏళ్లు మాత్రమే. అయితే తమ కుటుంబ పరిస్థితి లేకపోయినా తాను ఏడేళ్ల వయసున్నప్పుడు తన తండ్రి తనకు పది ఫుట్‌బాల్స్ గిఫ్ట్‌గా ఇచ్చాడని, అదే తన జీవితాన్ని మార్చేసిందని రిచర్లీసన్‌ గుర్తు చేసుకున్నాడు. అలా ఫుట్‌బాల్‌పై మక్కువ పెంచకున్న రిచర్లీసన్‌ ఒక వ్యాపారవేత్త దృష్టిలో పడ్డాడు. అతని ప్రాత్సాహంతోనే తాను ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్‌గా ఎదిగినట్లు చెప్పుకొచ్చాడు.

ఇక రిచర్లీసన్‌ అమెరికా మినీరో క్లబ్‌కు వెళ్లాకా అతని దశ మారిపోయింది. అక్కడి నుంచి రిచర్లీసన్‌ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇటీవలే ఎవర్టన్‌ క్లబ్‌ అతన్ని 6 కోట్ల పౌండ్లకు కొనుగోలు చేసింది. ఎవర్టన్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఒప్పందం ఇది కావడం విశేషం. ఏది ఏమైనా సెర్బియాతో మ్యాచ్‌లో నెయ్‌మర్‌ లేని లోటును రిచర్లీసన్‌ తీర్చాడని బ్రెజిల్‌ అభిమానులు కామెంట్‌ చేశారు.

చదవండి: FIFA WC: బైనాక్యులర్స్‌లో బీర్‌.. అడ్డంగా దొరికిన అభిమాని

మరిన్ని వార్తలు