FIFA World Cup 2022: బ్రెజిల్‌ గర్జన 

7 Dec, 2022 02:11 IST|Sakshi
రెండో గోల్‌ తర్వాత బ్రెజిల్‌ ఆటగాళ్లు వినిసియస్, రఫిన్హా, లుకాస్, నెమార్‌ సంబరం

కొరియాపై 4–1తో ఘనవిజయం

తొలి 36 నిమిషాల్లోనే నాలుగు గోల్స్‌

14వసారి క్వార్టర్స్‌ చేరిన మాజీ విజేత

9న క్రొయేషియాతో ‘ఢీ’  

దోహా: తమ నంబర్‌వన్‌ ర్యాంక్‌కు తగ్గ ఆటతో ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ టోర్నీలో మరో అడుగు ముందుకేసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బ్రెజిల్‌ 4–1 గోల్స్‌ తేడాతో దక్షిణ కొరియాను ఓడించి ఈ మెగా ఈవెంట్‌లో 14వసారి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బ్రెజిల్‌ తరఫున వినిసియస్‌ (7వ ని.లో), నెమార్‌ (13వ ని.లో), రిచార్లీసన్‌ (29వ ని.లో), లుకాస్‌ పక్వెటా (36వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. కొరియా తరఫున 79వ నిమిషంలో పాయిక్‌ సెంగ్‌హో ఏకైక గోల్‌ సాధించాడు. ఈనెల 9న జరిగే క్వార్టర్‌ ఫైనల్లో గత ప్రపంచకప్‌ రన్నరప్‌ క్రొయేషి యాతో బ్రెజిల్‌ తలపడతుంది.  

ఏడో నిమిషంలో రఫిన్హా ఇచ్చిన పాస్‌ ఇద్దరు బ్రెజిల్‌ స్ట్రయికర్లను దాటుకుంటూ వినిసియస్‌ జూనియర్‌ వద్దకు రాగా అతను గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. 13వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను నెమార్‌ గోల్‌ చేయడంతో ఆధిక్యం 2–0కు చేరింది. మరోవైపు కొరియన్లు కూడా గోల్‌ కోసం గట్టిగానే ప్రయత్నించారు. ఈ క్రమంలోనే 17వ నిమిషంలో వాంగ్‌ హిచన్‌ కొట్టిన కిక్‌ గోల్‌పోస్ట్‌ లెఫ్ట్‌కార్టర్‌లో ఎంతో ఎత్తు నుంచి దూసుకొచ్చింది.

కానీ బ్రెజిల్‌ గోల్‌కీపర్‌ అలీసన్‌ ఎడంవైపునకు హైజంప్‌ చేసి కుడిచేతి పంచ్‌తో బయటికి పంపాడు. ఇలా కొరియా స్కోరు చేయాల్సిన చోట అలీసన్‌ అడ్డుగోడ కట్టేశాడు. 29వ నిమిషంలో రిచార్లీసన్‌ కొరియా డిఫెండర్లను బోల్తా కొట్టించిన తీరు అద్భుతం. ‘డి’ ఏరియాకు ముందు బంతిని హెడర్‌తో నియంత్రించిన రిచార్లీసన్‌ కాలితో దగ్గరే ఉన్న మార్కిన్‌హస్‌కు పాస్‌ చేయగా... అతను దాన్ని రఫిన్హాకు అందించాడు.

ఈలోపే రిచార్లీసన్‌ ‘డి’ ఏరియాలోని గోల్‌పోస్ట్‌ ముందుకు దూసుకొచ్చాడు. రఫిన్హా వెంటనే బంతిని పాస్‌ చేయడంతో రిచార్లీసన్‌ గోల్‌ చేశాడు. ఇదంతా  ఏడు సెకన్లలోనే జరిగిపోయింది. ఇలా అరగంటలోపే బ్రెజిల్‌ ఎదురే లేని ఆధిక్యం సంపాదించింది. కాసేపటికి మళ్లీ 36వ నిమిషంలో నెమార్, రిచార్లీసన్‌ పాస్‌లతో బంతి కొరియా ‘డి’ ఏరియాలోకి వచ్చింది. అక్కడ వాళ్లిద్దరితో పాటు మరో ఇద్దరు బ్రెజిల్‌ స్ట్రయికర్లు కూడా వచ్చినప్పటికీ కొరియన్‌ డిఫెండర్లు ఈ నలుగురిని కాచుకున్నారు.

అయితే అనూహ్యంగా ఆఖరుగా ‘డి’ ఏరియాలోకి ప్రవేశించిన లుకాస్‌... బంతి అధీనంలో ఉన్న వినిసియస్‌ జూనియర్‌కు చేతితో సైగ చేశాడు. వెంటనే అతను కొరియన్‌ డిఫెండర్ల తలపై నుంచి బంతిని లుకాస్‌కు చేరవేశాడు. అతను కొరియన్ల కాళ్ల సందుల్లోంచి బంతి ని గోల్‌పోస్ట్‌లోకి కొట్టాడు. ఇలా తొలి అర్ధభాగంలోనే 4–0తో మ్యాచ్‌ను ఏకపక్షంగా లాగేసిన బ్రెజిల్‌ రెండో అర్ధభాగంలోనూ జోరు కొనసాగించింది. 

5 వరుసగా మూడు ప్రపంచకప్‌ టోర్నీలలో గోల్స్‌ సాధించిన ఐదో ప్లేయర్‌గా నెమార్‌ నిలిచాడు. గతంలో మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో    (పోర్చుగల్‌), షాకిరి (స్విట్జర్లాండ్‌), పెరిసిచ్‌ (క్రొయేషియా) ఈ ఘనత సాధించారు. 

2 వరుసగా ఎనిమిదిసార్లు ప్రపంచకప్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ దశకు చేరిన రెండో జట్టు బ్రెజిల్‌. గతంలో జర్మనీ (1986 నుంచి 2014 వరకు) మాత్రమే ఈ ఘనత సాధించింది. అంతేకాకుండా ఓవరాల్‌గా 14వసారి బ్రెజిల్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించి జర్మనీ (14 సార్లు) పేరిట ఉన్న రికార్డును సమం చేసింది.  

26 ఈసారి ప్రపంచకప్‌లో బ్రెజిల్‌ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో 26 మంది ఆటగాళ్లకు ఆడే అవకాశం కల్పించింది. మొత్తం ఎంపిక చేసిన 26 మంది ఆటగాళ్లకు ప్రపంచకప్‌ మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించిన తొలి జట్టుగా బ్రెజిల్‌ నిలిచింది.  

2 గత 60 ఏళ్లలో ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లోని తొలి అర్ధభాగంలోనే నాలుగు అంతకంటే ఎక్కువ గోల్స్‌ సాధించిన రెండో జట్టుగా బ్రెజిల్‌ గుర్తింపు    పొందింది. గతంలో నాలుగుసార్లు చాంపియన్‌ జర్మనీ  జట్టు మాత్రమే (2014 సెమీఫైనల్లో బ్రెజిల్‌పై ఐదు గోల్స్‌) ఈ ఘనత సాధించింది.    

మరిన్ని వార్తలు