ఇంగ్లండ్‌ టెస్ట్ జట్టు కోచ్‌గా బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌..!

11 May, 2022 20:55 IST|Sakshi

లండన్‌: ఇటీవలి కాలంలో వరుస పరాజయాల బాట పట్టిన ఇంగ్లండ్‌ టెస్ట్‌ టీమ్‌.. పూర్వ వైభవం సాధించే క్రమంలో జట్టులో సమూల మార్పులకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలుత కెప్టెన్‌ను మార్చిన ఆ జట్టు.. తాజాగా కొత్త కోచ్‌ను నియమించే పనిలో నిమగ్నమైంది. జో రూట్‌ రాజీనామా చేశాక బెన్‌ స్టోక్స్‌కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పిన ఈసీబీ (ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు).. టెస్ట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ పదవి కోసం న్యూజిలాండ్‌ మాజీ సారధి, కేకేఆర్‌ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 

ఈ మేరకు మెక్ కల్లమ్, ఈసీబీ మధ్య చర్చలు కూడా ముగిసినట్టు  సమాచారం. ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ.. గత కొద్ది రోజులుగా మెక్ కల్లమ్‌తో సంప్రదింపులు జరుపుతున్నాడని తెలుస్తోంది. కాగా, ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టు గతేడాది భారత పర్యటనకు వచ్చినప్పట్నుంచి వరుస పరాజయాల బాట పట్టి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. 

భారత్ చేతిలో ఓటమి తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాభవం, ఆతర్వాత యాషెస్‌లో ఆసీస్ చేతిలో 0-4 తేడాతో దారుణ ఓటమి, ఇటీవల విండీస్ చేతిలో 1-2 తేడాతో ఓటమి.. ఇలా ఆ జట్టు ఆడిన ప్రతి టెస్ట్‌ సిరీస్‌లోనూ ఓటమిపాలై ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత అప్రతిష్టను మూటగట్టుకుంది. దీంతో జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని ఈసీబీపై ఒత్తిడి అధికమైంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్‌ బోర్డు ఇంగ్లండ్‌ టెస్ట్‌ బృందంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. 

కాగా, జూన్‌లో 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ లో పర్యటించాల్సి ఉంది. ఈ సిరీస్ నుంచే స్టోక్స్ ఇంగ్లండ్ సారథిగా బాధ్యతలు చేపడతాడు. ఒకవేళ ఈసీబీతో మెక్‌కల్లమ్‌కు డీల్‌ కుదిరితే.. అతను తన సొంత జట్టుకు వ్యతిరేకంగా పని చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌ పేరు దాదాపుగా ఖరారైంది. కిర్‌స్టెన్‌ ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ మెంటార్‌గా ఉన్నాడు. 
చదవండి; 'దేశం దుర్భర స్థితికి ప్రభుత్వమే కారణం.. అసహ్యమేస్తోంది'

మరిన్ని వార్తలు