Mccullum As ENG Test Coach: హెడ్‌కోచ్‌గా మెక్‌కల్లమ్‌ పారితోషికం తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!

14 May, 2022 12:24 IST|Sakshi

ఇంగ్లండ్‌ నూతన టెస్టు కోచ్‌గా న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ ఎంపికయిన సంగతి తెలిసిందే. కోచ్‌ సిల్వర్‌వుడ్‌ స్థానంలో కొత్త కోచ్‌గా వచ్చిన మెక్‌కల్లమ్‌ జట్టును గాడిలో పెడతాడేమో చూడాలి. అసలే వరుస టెస్టు సిరీస్‌ వైఫల్యాలు ఇంగ్లండ్‌ను దెబ్బతీశాయి. ఈ ఓటములకు బాధ్యత వహిస్తూ జో రూట్‌ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) నాయకత్వ పగ్గాలు ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌కు అప్పగించింది. కొత్త కెప్టెన్‌.. కొత్త కోచ్‌ కలయికలో సరికొత్తగా కనిపిస్తున్న ఇంగ్లండ్‌ స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌ను గెలిచి మళ్లీ ట్రాక్‌లోకి వస్తుందా అనేది చూడాలి.

ఇదిలా ఉంటే.. మెక్‌కల్లమ్‌ నాలుగేళ్ల పాటు ఇంగ్లండ్‌ టెస్టు జట్టు కోచ్‌గా పనిచేయనున్నాడు. అందుకు సంబంధించి నాలుగేళ్ల కాలానికి గానూ మెక్‌కల్లమ్‌కు ఈసీబీ భారీగా చెల్లించనుంది. టెలిగ్రాఫ్‌.యూకే కథనం ప్రకారం 2 యూరో మిలియన్‌ డాలర్లకు(భారత కరెన్సీలో దాదాపు రూ. 18.88 కోట్లు) మెక్‌కల్లమ్‌తో నాలుగేళ్ల కాలానికి ఈసీబీ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక హెడ్‌కోచ్‌కు ఈసీబీ ఇంత మొత్తంలో చెల్లించడం ఇదే మొదటిసారి అని వార్తలు వస్తు‍న్నాయి. ఆటగాళ్లకు ఎంత చెల్లిస్తామనేది గ్రేడ్స్‌ ప్రకటించే క్రికెట్‌ బోర్డులు కోచ్‌లకు ఎంత చెల్లిస్తున్నామనేది ఎక్కడా బహిరంగపరచలేదు. అయితే మెక్‌కల్లమ్‌పై ఉన్న నమ్మకంతోనే ఈసీబీ అతనికి పెద్ద మొత్తం చెల్లిస్తుందని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. 

ఇక ఇంగ్లండ్‌ టెస్టు హెడ్‌కోచ్‌గా ఎంపికైన మెక్‌కల్లమ్‌ స్పందించాడు. ''ఇంగ్లండ్‌ క్రికెట్‌కు సేవలందించడానికి ఉవ్విళ్లూరుతున్నా. నాపై నమ్మకంతో బోర్డు నాకు అప్పగించిన బాధ్యతలను పాజిటివ్‌ ధోరణితో నిలబెట్టుకుంటా. ఓటములతో కుంగిపోయిన ఇంగ్లండ్‌ జట్టును గాడిలో​పెట్టడానికి ప్రయత్నిసా. బెన్‌ స్టోక్స్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు ఒక ఆటగాడిగా అతను నాకు పరిచయం.. ఇకపై ఇద్దరి సమన్వయంతో జట్టును ముందుకు నడిపించాల్సిన బాధ్యత మాపై ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. 

భారత్ చేతిలో ఓటమి తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాభవం, ఆతర్వాత యాషెస్‌లో ఆసీస్ చేతిలో 0-4 తేడాతో దారుణ ఓటమి, ఇటీవల విండీస్ చేతిలో 1-2 తేడాతో ఓటమి.. ఇలా ఆ జట్టు ఆడిన ప్రతి టెస్ట్‌ సిరీస్‌లోనూ ఓటమిపాలై ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత అప్రతిష్టను మూటగట్టుకుంది. దీంతో జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని ఈసీబీపై ఒత్తిడి అధికమైంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్‌ బోర్డు ఇంగ్లండ్‌ టెస్ట్‌ బృందంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. మరోవైపు ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌ పేరు దాదాపుగా ఖరారైంది. కిర్‌స్టెన్‌ ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ మెంటార్‌గా ఉన్నాడు. 

చదవండి: IPL 2022: క్రికెట్‌కు వీరాభిమాని.. ఇతని స్టైల్‌ వేరు

RCB Play-Off Chances: ఆర్‌సీబీకి ప్లేఆఫ్‌ అవకాశం ఎంత?.. కోహ్లిపై డుప్లెసిస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు