Brett Lee-Umran Malik: 'ఉమ్రాన్‌ మాలిక్‌కు పెద్ద అభిమానిని.. మదిలోకి పాక్‌ దిగ్గజ బౌలర్‌'

31 May, 2022 17:18 IST|Sakshi
PC: IPL Twitter

ఎస్‌ఆర్‌హెచ్‌ స్టార్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ఐపీఎల్‌ 2022 సీజన్‌లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రతీ బంతిని గంటకు 150 కిమీ వేగంతో సంధించే ఉమ్రాన్‌ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని(157.8 కిమీ) సంధించి రికార్డు సృష్టించాడు. ఇక బౌలింగ్‌లో దుమ్మురేపిన ఉమ్రాన్‌ మాలిక్‌ 14 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు కొల్లగొట్టాడు. లీగ్‌ దశలో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5/25తో బెస్ట్‌ బౌలింగ్‌ ఫిగర్స్‌ నమోదు చేశాడు.

కాగా ఈ సీజన్‌లో తన ప్రదర్శనకు గానూ ఉమ్రాన్‌ మాలిక్‌ ''ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌'' అవార్డును కైవసం చేసుకున్నాడు. అతని బౌలింగ్‌కు ఫిదా అయిన మాజీ క్రికెటర్లు త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడని పేర్కొనడమే తరువాయి.. దక్షిణాఫ్రికాతో జరగనున్న టి20 సిరీస్‌కు ఉమ్రాన్‌ మాలిక్‌ ఎంపికవ్వడం విశేషం.తాజాగా ఆస్ట్రేలియా మాజీ స్పీడస్టర్‌ బ్రెట్‌ లీ ఉమ్రాన్‌ మాలిక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

''నేను ఉమ్రాన్‌ మాలిక్‌కు పెద్ద అభిమానిని. అతని బౌలింగ్‌లో ఉండే వేగం ప్రత్యర్థి బ్యాటర్లను తగలెట్టేస్తుంది. ఫాస్ట్‌ బౌలర్లకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉమ్రాన్‌లో స్పష్టంగా ఉన్నాయి. కచ్చితమైన వేగం.. బులెట్‌ వేగంతో వచ్చే బంతులు.. ఇవన్నీ కలిపి ఉమ్రాన్‌ గురించి ఆలోచిస్తుంటే నాకు పాక్‌ దిగ్గజ బౌలర్‌ వకార్‌ యూనిస్‌ గుర్తుకు వస్తున్నాడు. వకార్‌ యూనిస్‌ కూడా ఫాస్ట్‌ బౌలింగ్‌కు పెట్టింది పేరు. గంటకు 150 కిమీవేగంతో బంతులు సందిస్తూ వికెట్లు తీసేవాడు. అందుకే అంత గొప్ప ఫాస్ట్‌ బౌలర్‌ అయ్యాడు. ఉమ్రాన్‌ కూడా ఏదో ఒకరోజు ఆ స్థాయికి చేరుకుంటాడని ఆశిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: Jos Buttler: పరుగులే కాదు.. ప్రైజ్‌మనీ విషయంలోనూ చరిత్ర సృష్టించాడు

ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు.. కానీ రెండు టైటిల్స్‌.. ఐపీఎల్‌లో మోస్ట్‌ లక్కీ ప్లేయర్‌..!

మరిన్ని వార్తలు