ENG vs IND: 19 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన బుమ్రా.. అభినందించిన బ్రియాన్‌ లారా

3 Jul, 2022 11:32 IST|Sakshi

టెస్టు‍ల్లో తన రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా స్టాండింగ్‌ కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రాను వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా అభినందించాడు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టులో 84 ఓవర్‌ వేసిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో బుమ్రా ఏకంగా 29 పరుగులు రాబట్టాడు. తద్వారా టెస్టు క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా బుమ్రా ప్రపంచ రికార్డు సాధించాడు. కాగా అంతకుమందు 2003లో జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్‌ ఆర్.పీటర్సన్ బౌలింగ్‌లో బ్రియన్‌ లారా 28 పరుగులు రాబట్టాడు. ఇప్పుడు బుమ్రా దాదాపు 19 ఏళ్ల లారా రికార్డు బద్దలు కొట్టాడు.

“టెస్ట్‌లలో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టినందుకు అభినందనలు. అద్భుతంగా ఆడావు బుమ్రా" అంటూ లారా ట్వీట్‌ చేశాడు. ఇక మ్యాచ్‌ విషయానకి వస్తే.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. పంత్‌(146),రవీంద్ర జడేజా(104) పరుగులతో రాణించారు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. జో రూట్‌ (31) టాప్‌ స్కోరర్‌గా నిలవగా...ప్రస్తుతం బెయిర్‌స్టో (12 బ్యాటింగ్‌), స్టోక్స్‌ (0 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు.

మరిన్ని వార్తలు