బ్రియన్‌ లారా మెచ్చిన యంగ్‌ క్రికెటర్‌ అతనే!

9 Nov, 2020 11:57 IST|Sakshi

వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ బ్రియాన్ లారా ఇప్పుడు ఉన్న ఇండియన్‌ యంగ్‌ క్రికెటర్లలలో తనకు ఎవరు ఇష్టమో ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఐదుగురు యంగ్‌ క్రికెటర్ల పేర్లు ప్రస్తావిస్తూ వారంటే తనకు ఎందుకు అంత ఇష్టమో పేర్కొన్నారు. లారాకు ఇష్టమైన క్రికెటర్లలో సంజూ సామ్‌సన్‌ ముందు వరుసలో ఉన్నాడు. తనకు ఇష్టమైన ప్లేయర్ల గురించి అడగగా ఆయన మొదట సంజూ పేరునే ప్రస్తావించారు. ఐపీఎల్‌ 2020లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరుపున ఆడుతున్న సంజూ రెండు మ్యాచ్‌ల్లో 16 సిక్స్‌లు కొట్టి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అయితే ఆ తరువాత మ్యాచ్‌ల్లో దానిని కొనసాగించలేకపోయాడు. లారా, సంజూ గురించి మాట్లాడుతూ, ‘నాకు సంజూ సామర్థ్యం అంటే చాలా ఇష్టం. అతనికి మంచి టైమింగ్‌, సామర్థ్యం ఉంది. అతను ఉన్నత స్థాయికి చేరుతాడు’ అని అన్నారు. 

ఇక లారాకు ఇష్టమైన మరో క్రికెటర్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరుపున ఆడుతున్న సూర్య కుమార్‌ యాదవ్‌. ఈయన ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడి 461 పరుగులు చేశాడు. సరాసరి 41.90 పరుగులు. ‘ఒక వేళ టీంలో బెస్ట్‌ ప్లేయర్లు ఓపెనర్లుగా లేనప్పుడు సూర్యకుమార్‌ను నెంబర్‌ 3గా దించాలి. ఓపెనర్లు ఆడటంలో విఫలమైన ఇతను నిలకడగా ఆడి టీంని గెలిపించే అవకాశాలు ఉన్నాయి’ అని లారా పేర్కొన్నారు. 

ఇక తనకిష్టమంటూ లారా చెప్పిన మరో పేరు దేవ్‌దత్‌ పడిక్కల్‌. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు తరుపున ఆడుతున్న దేవ్‌దత్‌ ఈ సీజన్‌లో ఆర్‌సీబీ జట్టులో ఎక్కువ రన్స్‌ చేశాడు. ఇక ఇతని గురించి లారా మాట్లాడుతూ, ‘దేవ్‌దత్‌కు చాలా సామర్థ్యం ఉంది. అయితే అతను కొన్ని విషయాలను మార్చుకోవాలి. నేను అతను కేవలం టీ20, ఐపీఎల్‌లో మాత్రమే ఆడాలని కోరుకోవడం లేదు. అతను టెస్ట్‌లలో కూడా ఆడాలి. దానికి కొన్ని టెక్నిక్‌లను తెలుసుకోవాలి’ అని అన్నారు. 

మరోవైపు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా తనకు ఇష్టమైన ఆటగాళ్లలో ఉన్నాడంటూ లారా చెప్పారు. ‘అతను కచ్ఛితంగా ఒక మంచి ఆటగాడు. అతని గురించి ఇంతకి మించి ఏం చెప్పగలను’ అని లారా పేర్కొన్నాడు. ఇక హైదరాబాద్‌ సన్‌ రైజర్స్‌ జట్టు ఆటగాడు, అండర్‌ -19 మాజీ కెప్టెన్‌ ప్రియమ్‌ గార్గ్‌ కూడా లారా దృష్టని ఆకర్షించాడు. ‘నాకు తెలిసి ప్రియమ్‌ గార్గ్‌కు చాలా సామర్థ్యం ఉంది’ అని అన్నారు. ఇక సన్‌రైజర్స్‌ జట్టులోని మరో ఆటగాడు, జమ్ము- కశ్మీర్‌ ఆల్‌ రౌండర్‌ అబ్దుల్‌ సమద్‌ కూడా బాగా ఆడుతున్నాడు అంటూ లారా కితాబిచ్చాడు.  
చదవండి: ధోనీలా ఆడడం లేదు: బ్రియన్‌ లారా

మరిన్ని వార్తలు