రేపే ఐపీఎల్ 2020 షెడ్యూల్ విడుద‌ల‌

5 Sep, 2020 16:56 IST|Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్ 13వ సీజ‌న్ ప్రారంభానికి ఇంకా 14 రోజుల స‌మ‌యమే ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా ఎలాంటి షెడ్యూల్ విడుద‌ల కాలేదు. బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ లీగ్‌కు సంబంధించి అన్ని ప‌నులు పూర్త‌య్యాయ‌ని.. శుక్ర‌వారం (సెప్టెంబ‌ర్ 4న‌) తుది షెడ్యూల్ విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించాడు. కానీ నిన్న ఐపీఎల్‌కు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ విడుద‌ల చేయ‌లేదు. దీంతో అస‌లు ఐపీఎల్ జ‌రుగుతుందా అన్న అనుమానాలు కూడా మొద‌ల‌య్యాయి.

కానీ తాజాగా ఐపీఎల్ 2020కి సంబంధించి  పూర్తి షెడ్యూల్ రేపు (సెప్టెంబ‌ర్ 6, ఆదివారం) అధికారికంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ఛైర్మ‌న్ బ్రిజేష్ ప‌టేల్ తెలిపారు. శ‌నివారం ఏఎన్ఐకి ఇచ్చిన ఇంట‌ర్య్వూలో బ్రిజేష్‌ స్వ‌యంగా వెల్ల‌డించారు. దీంతో ఐపీఎల్ షెడ్యూల్‌కు సంబంధించిన నిరీక్ష‌ణ‌కు తెర‌‌ప‌డిన‌ట్ల‌యింది. ముంబైతో జ‌ర‌గ‌బోయే ఓపెనింగ్ మ్య‌చ్‌కు చెన్నై కూడా సిద్ధంగా ఉన్నట్లు ఇప్ప‌టికే తెలిపింది. (చ‌ద‌వండి : భ‌జ్జీ దృష్టిలో డ‌బ్బు అనేది చివ‌రి ఆప్ష‌న్‌)

బ్రిజేష్ ప‌టేల్ మాట్లాడుతూ.. 'సెప్టెంబ‌ర్ 19 నుంచే ఐపీఎల్ 13వ సీజ‌న్ ప్రారంభం కానుంది. లీగ్కు‌‌ సంబంధించి ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఐపీఎల్లో పాల్గొన‌బోయే అన్ని జ‌ట్లు ఇప్పటికే త‌మ ప్రాక్టీస్‌ను ఆరంభించాయి. ‌రేపు అధికారికంగా ఐపీఎల్ షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌బోతున్నాం. షార్జా, దుబాయ్‌, అబుదాబి వేదిక‌గా మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి' అంటూ తెలిపారు.

క‌రోనా నేప‌థ్యంలో ఐపీఎల్ 2020ని భార‌త్ నుంచి యూఏఈకి మార్చారు. అబుదాబి, షార్జా, దుబాయ్ వేదిక‌లుగా మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే అన్ని జ‌ట్లు అక్క‌డికి చేరుకొని ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. కాగా అంద‌రికంటే చివ‌రిగా చెన్నై జ‌ట్టు శుక్ర‌వారం త‌మ ప్రాక్టీస్‌ను ఆరంభించింది. దుబాయ్‌కు రాగానే సీఎస్‌కే జ‌ట్టులో 13 మంది క‌రోనా బారీన ప‌డిన‌ట్లు బీసీసీఐ పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. వారెవ‌ర‌నేది బ‌య‌ట‌కు చెప్ప‌క‌పోయినా.. అందులో ఇద్ద‌రు ఆట‌గాళ్లు, మిగతావారు సీఎస్‌కే సిబ్బంది అని తేలింది. అయితే ఇప్ప‌టికే ఆ 13 మందికి మూడోసారి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నెగెటివ్ రావ‌డంతో చెన్నై జ‌ట్టు త‌మ ప్రాక్టీస్‌ను ఆరంభించింది. ఈసారి ఐపీఎల్ 2020 స్పాన్స‌ర్‌షిప్ హ‌క్కుల‌ను డ్రీమ్ 11 ఏడాది కాలానికి గానూ దాదాపు రూ.250 కోట్ల‌తో సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. (చ‌ద‌వండి : ‘సచిన్‌ ప్రేరణ కలిగించలేదు’)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు