బౌలింగ్‌లో అశూ, సిరాజ్, బుమ్రా, షమీ.. బ్యాటింగ్‌లో రోహిత్‌, పంత్‌, పుజారా!

31 Dec, 2021 12:01 IST|Sakshi

బ్రిస్బేన్‌ టు సెంచూరియన్‌ వయా లార్డ్స్‌...

Brisbane To Centurion Team India Victory: ఎనిమిది టెస్టుల్లో విజయాలు... ఇందులో నాలుగు విదేశాల్లో, ప్రతికూల పరిస్థితుల మధ్య వచ్చినవే. సగటు క్రికెట్‌ అభిమానికి 2021 సంవత్సరం పంచిన ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే. టీమిండియా అంచనాలకు మించిన ఆటతో, అద్భుత ప్రదర్శనతో అనూహ్య విజయాలు సాధించిన ఈ టీమ్‌ భారత అత్యుత్తమ టెస్టు జట్లలో ఒకటిగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. సిడ్నీలో ఓడిపోయే మ్యాచ్‌ను అసమాన పోరాటంతో రక్షించుకోవడంతో ఈ ఏడాది మొదలైంది.

విహారి, అశ్విన్‌ ఏకంగా 42.4 ఓవర్ల పాటు వికెట్‌ కాపాడుకోవడం అసాధారణం. బ్రిస్బేన్‌కు రా, చూసుకుందాం... అంటూ ఆసీస్‌ కెప్టెన్‌ విసిరిన సవాల్‌కు తిరుగులేని రీతిలో స్పందించిన టీమిండియా 3 వికెట్ల విజయంతో ప్రత్యర్థికి షాక్‌ ఇచ్చింది. 1988నుంచి గాబా మైదానంలో ఓడని 33 ఏళ్ల ఆసీస్‌ కోటను బద్దలు కొట్టి తామేంటో చూపించింది. మ్యాచ్‌ ఫలితమే కాకుండా ‘36 ఆలౌట్‌’నుంచి మొదలైన సిరీస్‌ను చివరకు సొంతం చేసుకోవడం భావోద్వేగాలపరంగా కూడా భారత క్రికెట్‌లో ఈ విజయానికి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది.

ఇంగ్లండ్‌తో లార్డ్స్‌ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కోల్పోయిన తర్వాత కూడా కోలుకొని మ్యాచ్‌ గెలుచుకోవడం మరో చిరస్మరణీయ ఘట్టం. ఓవల్‌లోనూ దాదాపు వంద పరుగుల ఆధిక్యం చేజార్చుకొని మళ్లీ ఎగసిన తీరు టీమిండియా సత్తాకు మరో సూచిక. ఇప్పుడు సెంచూరియన్‌లో కూడా అలాంటి విజయమే. ఈ మైదానంలో దక్షిణాఫ్రికా తాజా టెస్టుకు ముందు 26 టెస్టులు ఆడగా 2 మాత్రమే ఓడింది.

ఇలాంటి చోట కూడా కోహ్లి సేన జెండా ఎగరేసింది. స్వదేశంలో ఇంగ్లండ్‌ చేతిలో చెన్నైలో అనూహ్యంగా ఓడినా... మిగిలిన మూడు టెస్టుల్లో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడం మన గడ్డపై కూడా మన బలాన్ని చూపించింది. న్యూజిలాండ్‌తో కూడా ఊహించిన విధంగానే సిరీస్‌ విజయం దక్కింది. ఈ జోరులో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో కివీస్‌ చేతిలో ఓడటమే కొంత నిరాశ కలిగించిన అంశం. అయితే మన బృందం సాధించిన ఘనతలను ఈ ఒక్క ఓటమి కారణంగా తక్కువ చేయలేం.

ఈ సంవత్సరం ప్రత్యర్థి జట్లను 12 సార్లు 200 పరుగుల లోపే ఆలౌట్‌ చేయగలగడం చూస్తే మన ఆధిపత్యం ఎలా సాగిందో అర్థమవుతుంది. బౌలింగ్‌లో అశ్విన్‌ (54 వికెట్లు), సిరాజ్‌ (31), బుమ్రా (30), షమీ (23) భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తే... రోహిత్‌ శర్మ (906 పరుగులు), పంత్‌ (748), పుజారా (702), కోహ్లి (536)ల బ్యాటింగ్‌ ప్రదర్శన 2021ను సంతోషంగా ముగించేలా చేసింది. ఇదే జోరు మున్ముందూ కొనసాగితే విదేశాల్లో భారత్‌ విజయాల గురించి ఇకపై సంచలనం, అనూహ్యంలాంటి విశేషణాలను ఉపయోగించాల్సిన అవసరం రాకపోవచ్చు! 

ఈ క్రమంలో తాజా విజయంతో 2021ను ఘనంగా ముగించిన నేపథ్యంలో భారత జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘‘టెస్టు క్రికెట్‌లో ఈ ఏడాదికి అద్భుతమైన ముగింపు. సెంచూరియన్‌లో గెలిచిన తొలి ఆసియా జట్టుగా నిలిచినందుకు శుభాకాంక్షలు’’ అంటూ టీమిండియా ఆటగాడు శిఖర్‌ ధావన్‌ సహచరులను అభినందించాడు.

ఇక క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ సైతం సెంచూరీయన్‌లో బౌలర్ల ఆట తీరును ప్రస్తావిస్తూ ఆకాశానికెత్తాడు. ‘‘టెస్టు మ్యాచ్‌లో 20 వికెట్లు పడగొట్టారు. ప్రపంచంలో ఇలాంటిది ఎక్కడైనా చూశారా.. సూపర్‌ బౌలింగ్‌ అటాక్‌. అద్భుత విజయం. టీమిండియాకు కంగ్రాట్స్‌’’అంటూ ట్విటర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశాడు.

చదవండి: IND Vs SA: భారత్‌తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం!

మరిన్ని వార్తలు