VIDEO: బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రిలో డేంజరస్‌ క్రాష్‌, చేసింది చాలక వేడుకలా? హామిల్టన్‌పై రేసిజం కామెంట్లు

19 Jul, 2021 10:49 IST|Sakshi

నాటకీయ పరిణామాల నడుమ బ్రిటిష్‌ప్రి రేస్‌ నెగ్గిన ఫార్ములా వన్‌ ప్రపంచ ఛాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. రెడ్‌బుల్‌ రేసర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ని ఢీ కొట్టాడని, అతను ఆస్పత్రి పాలైతే.. లూయిస్‌ గెలిచి సంబురాలు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్‌ అని  హామిల్టన్‌ను నిలదీస్తున్నారు. 

ఆదివారం బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి రేసులో విజేతగా నిలిచాడు మెర్సెడెస్‌ రైడర్‌ లూయిస్‌ హామిల్టన్‌. అయితే తొలి ల్యాప్‌లోనే రెడ్‌బుల్‌ రైడర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ను ప్రమాదకరమైన మలుపుతో ఢీకొట్టడం, ఆపై వెర్‌స్టాపెన్‌ను ఆస్పత్రికి తరలించడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో లూయిస్‌కు పది సెకండ్ల పెనాల్టీ విధించారు. అయినప్పటికీ లూయిస్‌ రేస్‌ నెగ్గి, సంబురాలు చేసుకున్నాడు.

అయితే తాను ఆస్పత్రి పాలైన టైంలో వేడుకలు చేసుకోవడం సరికాదని వ్యాఖ్యానించాడు వెర్‌స్టాపెన్‌. ‘లూయిస్‌ తీరు సరికాదు. అమానుషం. స్పోర్టివ్‌ స్ఫూర్తికి విరుద్ధం. ఆటగాళ్లు వ్యవహరించాల్సిన తీరు అది కానేకాద’ని అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు సిగ్గులేకుండా క్రాష్‌కి పాల్పడి.. గెలుపు సంబురాలు చేసుకున్నాడని, అదసలు గెలుపే కాదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. 

మొత్తం లక్షా నలభై వేలమంది వ్యూయర్స్‌ మధ్య  ఆదివారం బ్రిట్రిష్‌ గ్రాండ్‌ప్రి జరిగింది. అయితే పోల్‌ పొజిషన్‌తో రేసును ఆరంభించిన వెర్‌స్టాపెన్‌, లూయిస్‌ ఢీ కొట్టడంతో తొలి ల్యాప్‌లోనే వైదొలిగాడు. ఆ వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఇక 52 ల్యాప్‌ల రేసును 58 నిమిషాల 23.284 సెకన్లలో పూర్తి చేశాడు లూయిస్‌. తద్వారా బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రిలో వరుసగా మూడో ఏడాది.. ఓవరాల్‌గా ఏనిమిదో సారి విజేతగా నిలిచాడు.

జాతి వివక్ష
మరోవైపు రెడ్‌బుల్‌ ఈ విజయాన్ని క్రూరత్వంగా వర్ణిస్తోంది. హామిల్టన్‌కు పెనాల్టీ సరిపోయే శిక్ష కాదని చెబుతోంది. ఇదిలా ఉంటే లూయిస్‌ హామిల్టన్‌పై సోషల్‌ మీడియాలో జాతి వివక్ష కామెంట్లు మొదలయ్యాయి. కోతి(మంకీ) ఎమోజీలను ఉంచుతున్నారు చాలామంది. మరోవైపు మెర్సడెస్‌ ఈ కామెంట్లను ఖండిస్తోంది. వర్ణ వివక్షకు తాము వ్యతిరేకమని, టాలెంట్‌ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించడమే మా పని అంటూ పేర్కొంది.

మరిన్ని వార్తలు