గంగూలీకి అరుదైన గౌరవం.. బ్రిటిష్​ పార్లమెంట్‌లో సత్కారం​

14 Jul, 2022 16:57 IST|Sakshi

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. 2002 నాట్‌వెస్ట్‌ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా విజయం సాధించి (జులై 13) 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా బ్రిటిష్ పార్లమెంట్ దాదాను సత్కరించింది. ఈ విషయాన్ని గంగూలీనే స్వయంగా వెల్లడించాడు. బ్రిటిష్ పార్లమెంట్‌ తనను సత్కరించినందుకు గాను ఓ బెంగాలీగా చాలా గర్వపడుతున్నానని తెలిపాడు. ఈ సన్మానం కోసం యూకే ప్రతినిధులు ఆరు నెలల కిందటే తనను సంప్రదించారని వివరించాడు. బ్రిటన్‌ పార్లమెంట్ ప్రతి ఏడాది ఇలా ఒకరిని సత్కరిస్తుందని, ఈ సారి ఆ అవకాశం తనకు లభించిందని పేర్కొన్నాడు. 

కాగా, జులై 13 2002లో గంగూలీ నేతృత్వంలోని టీమిండియా నాట్‌వెస్ట్‌ ట్రోఫీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై సంచలన విజయం నమోదు చేసి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. గంగూలీ సేన ఆ చిరస్మరణీయ విజయం సాధించి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా జులై 13, 2022న బ్రిటన్‌ పార్లమెంట్‌ గంగూలీని గౌరవించింది. ఆ మ్యాచ్‌లో నాటి యువ భారత జట్టు 326 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 3 బంతులుండగానే ఛేదించి చరిత్ర సృష్టించింది. యువరాజ్‌ సింగ్‌ (69), మహ్మద్‌ కైఫ్‌ (87 నాటౌట్‌)లు మరపురాని ఇన్నింగ్స్‌ను ఆడి టీమిండియాకు అపురూప విజయాన్ని అందించారు. 

ఆ మ్యాచ్‌లో కైఫ్‌ విన్నింగ్‌ షాట్‌ కొట్టిన అనంతరం కెప్టెన్‌ గంగూలీ షర్ట్‌ విప్పి ప్రదర్శించిన విజయదరహాసం భారత క్రికెట్‌ అభిమాని మదిలో చిరకాలం మెదులుతూనే ఉంటుంది. నాడు కెప్టెన్‌గా గంగూలీ సాధించిన అద్భుత విజయాన్ని స్మరించుకుంటూ బ్రిటన్‌ పార్లమెంట్‌ నిన్న దాదాను సత్కరించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలోనే ఉన్న టీమిండియా రీషెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ ఓడినప్పటికీ.. 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. అలాగే మూడు వన్డేల సిరీస్‌లోనూ రోహిత్‌ సేన 1-0లో ఆధిక్యంలో కొనసాగుతుంది.
చదవండి: Sourav Ganguly: అప్పుడు సచిన్‌, ద్రవిడ్‌.. నేను! ఇప్పుడు కోహ్లి వంతు! కానీ..

మరిన్ని వార్తలు