Jasprit Bumrah:19 ఏళ్ల చెత్త రికార్డు బద్దలు.. జహీర్‌ తర్వాత బుమ్రానే

15 Aug, 2021 15:40 IST|Sakshi

లార్డ్స్‌: భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా పాత సమస్య మళ్లీ ముందుకొచ్చి నట్లుంది. లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఏకంగా 13 నోబాల్స్‌ వేశాడు. ఈ నేపథ్యంలో అతను ఒక చెత్త రికార్డును నమోదు చేశాడు. ఇంతకముందు 2002లో జహీర్‌ఖాన్‌ విండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 13 నోబాల్స్‌ వేశాడు.  ఆ తర్వాత మరే భారత బౌలర్‌ ఇన్ని నోబాల్స్‌ వేయలేదు. మళ్లీ 19 ఏళ్ల తర్వాత బుమ్రా ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌లో 13 నోబాల్స్‌ వేసి జహీర్‌తో సమానంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా 26 ఓవర్లు వేసి 79 పరుగులిచ్చి ఒక వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే డ్రాగా ముగుస్తుందా లేక ఫలితం వస్తుందా అన్నది నాలుగో రోజు ఆటపై ఆధారపడి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ వేగంగా ఆడి ఇంగ్లండ్‌కు ఎంత టార్గెట్‌ విధిస్తుందనేది చూడాలి. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ జో రూట్‌ (321 బంతుల్లో 180 నాటౌట్‌; 18 ఫోర్లు) వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీ సాధించగా... జానీ బెయిర్‌స్టో (107 బంతుల్లో 57; 7 ఫోర్లు) రాణించాడు. సిరాజ్‌కు 4, ఇషాంత్‌కు 3 వికెట్లు దక్కాయి. మూడో రోజు ఆట చివరి ఓవర్‌ చివరి బంతికి అండర్సన్‌ను షమీ బౌల్డ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ ఆట ముగిసింది. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్‌ అయింది.  

మరిన్ని వార్తలు