BGT 2023: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌.. భారత్‌కు గుడ్‌ న్యూస్‌! యార్కర్ల కింగ్‌ వచ్చేస్తున్నాడు

3 Feb, 2023 16:42 IST|Sakshi

Jasprit Bumrah Comeback: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్‌. గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో పునరాగమనం చేయనున్నాడు.

 ధర్మశాల వేదికగా మార్చి1 నుంచి ఆసీస్‌తో జరగనున్న మూడో టెస్టుకు బుమ్రా అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్నాడు. 

ఈ క్రమంలో బుమ్రా పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించినట్లు తెలుస్తోంది. అదే విధంగా నెట్స్‌లో బౌలింగ్‌ కూడా బుమ్రా ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు సమాచారం. "బుమ్రా ప్రస్తుతం ఫిట్ గా ఉన్నాడు. అతడు నెట్స్ లో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. త్వరలోనే అతడు జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు" అని ఎన్సీఏ అధికారి ఒకరు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో పేర్కొన్నారు. 

గాయాలతో సహవాసం..
కాగా గతేడాది ఇంగ్లండ్ పర్యటన తర్వాత బుమ్రా తన వెన్ను నొప్పి గురించి బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో అతడికి వెన్ను మళ్లీ వెన్ను గాయం తిరగబెట్టినట్లు బీసీసీఐ వైద్య బృందం ధృవీకరించింది. దీంతో అతడు వెస్టిండీస్ పర్యటనకు, ఆసియా కప్ 2022 కు దూరమయ్యాడు. అనంతరం అతడు ఎన్సీఏలో మళ్లీ పునరావాసం ప్రారంభించాడు.

మళ్లీ ఫిట్‌నెస్‌ సాధించిన అనంతరం బుమ్రా స్వదేశంలో స్ట్రేలియాతో సిరీస్ కు ఎంపికయ్యాడు. అయితే ఆ మ్యాచ్ మధ్యలోనే వెన్ను గాయం తిరగబెట్టింది. దాంతో టీ20 ప్రపంచకప్ నకు దూరమయ్యాడు. అ తర్వాత దాదాపు 5 నెలలపాటు ఎన్సీఏలో ఉన్న బమ్రా తిరిగి శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదని సిరీస్‌ ప్రారంభానికే ముందు సెలక్టర్లు అతడిని జట్టు నుంచి తప్పించారు.

డబ్లూటీసీ ఫైనల్‌కు చేరాలంటే?
వరల్డ్‌టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోరుకు అర్హత సాధించాలంటే టీమిండియాకు ఈ సిరీస్‌ కీలకం. ఈ సిరీస్‌లో భారత్‌ కనీసం రెండు మ్యాచ్‌లోనైనా విజయం సాధించినా చాలు డబ్లూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. డబ్ల్యూటీసీ  పాయింట్ల పట్టికలో 75.56 శాతంతో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఇప్పటికే తమ ఫైనల్‌ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇక ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ చారిత్రత్మక సిరీస్‌ ప్రారంభం కానుంది.

ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్‌
చదవండి
ENG vs NZ: ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌.. న్యూజిలాండ్‌ జట్టు ఇదే! స్టార్‌ బౌలర్‌ వచ్చేశాడు

మరిన్ని వార్తలు