Sanjana Ganesan: వదినమ్మ అంటూనే వెకిలి కామెంట్‌.. పో.. ఇక్కడి నుంచి!

13 Feb, 2024 10:09 IST|Sakshi

Jasprit Bumrah's Wife Sanjana Ganesan Fiery Reply: ప్రముఖ స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌, టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా సతీమణి సంజనా గణేషన్‌ ప్రస్తుతం మాతృత్వ మధురిమలను ఆస్వాదిస్తున్నారు. కెరీర్‌కు కాస్త విరామం ఇచ్చి తమ చిన్నారి కుమారుడు అంగద్‌ ఆలనాపాలనతో సంతోషంగా సమయం గడుపుతున్నారు.

మరోవైపు.. బుమ్రా ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. తొలి రెండు టెస్టుల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన అతడు.. రాజ్‌కోట్‌ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మొదలుకానున్న మూడో మ్యాచ్‌ కోసం సన్నద్ధమవుతున్నాడు.

ఇక బుమ్రా- సంజనాలది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాలంటైన్స్‌ డే సందర్భంగా ఇద్దరూ కలిసి ఓ యాడ్‌లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బుమ్రా తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశాడు.


PC: Bumrah Insta Grab

క్రికెట్‌ బాల్‌తో మొదలుపెట్టి.. ఫొటోషూట్‌ వరకు కపుల్‌ గోల్స్‌ సెట్‌ చేసే విషయంలో ఇలా ఉంటామంటూ బుమ్రా- సంజనా ఆహ్లాదంగా మాట్లాడుకుంటూ వీడియోలో కనిపించారు. అభిమానులను ఆకట్టుకుంటున్న వీడియోపై ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ మాత్రం వెకిలిగా కామెంట్‌ చేశాడు.

‘‘వదినమ్మ.. రోజు రోజుకీ లావైపోతోంది’’ అని బాడీషేమింగ్‌ చేశాడు. ఇందుకు.. సంజనా కూడా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. ‘‘పాఠశాలలో సైన్సు పుస్తకాల్లో చదివిన విషయాలు నీకు గుర్తులేవా? మహిళల శరీరంపై కామెంట్‌ చేయడానికి నీకెంత ధైర్యం? పో ఇక్కడి నుంచి..’’ అంటూ సంజనా గణేషన్‌ చురకలు అంటించారు.


PC: Bumrah Insta Grab

ఈ క్రమంలో అభిమానులు సంజనాకు అండగా నిలుస్తూ.. ‘‘బాగా బుద్ధి చెప్పారు భాభీ’’ అని ప్రశంసిస్తున్నారు. కాగా తల్లైన తర్వాత సాధారణంగా శరీరంలో వచ్చే మార్పుల కారణంగా సంజనా కూడా మునుపటి కంటే కాస్త బొద్దుగా కనిపించారు. దీంతో ఆకతాయి అలా కామెంట్‌ చేశాడు. అయితే, తానొక తల్లినన్న విషయాన్ని గుర్తుచేస్తూ ఆమె ఇలా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

సెలబ్రిటీలకూ తప్పని చేదు అనుభవాలు
కొత్తగా తల్లైన వారు బిడ్డకు పాలిచ్చే క్రమంలో వచ్చే శరీర మార్పుల కారణంగా చుట్టూ ఉన్న వాళ్ల మాటల కారణంగా కొన్నిసార్లు ఆత్మన్యూనతకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అయితే, సహజ సిద్ధంగా జరిగే ఈ మార్పుల గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సంజనా కూడా అదే విషయాన్ని చెప్పారు.

గతంలో.. టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా సైతం కుమారుడు ఇజహాన్‌ పుట్టిన తర్వాత ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కొన్నారు. అయితే, ట్రోల్స్‌ను పట్టించుకోకుండా.. తన కోసం తాను సమయం కేటాయించుకుని ఫిట్‌నెస్‌ సాధించి మళ్లీ మునపటిలా మారిపోయారు.

 ఇదిలా ఉంటే.. 2021లో జస్‌ప్రీత్‌ బుమ్రా- సంజనా గణేషన్‌ వివాహం జరగగా.. గతేడాది సెప్టెంబరు 4న వీరికి కుమారుడు అంగద్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా జన్మించాడు.

whatsapp channel

మరిన్ని వార్తలు