Jasprit Bumrah: 'కనబడుట లేదు(#Missing)'.. ఐపీఎల్‌లో ఆడించేందుకే ఈ డ్రామాలు

20 Feb, 2023 12:30 IST|Sakshi

టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా విషయంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఒకసారి ఫిట్‌గా ఉన్నాడంటూ జాతీయ జట్టులోకి ఎంపిక చేస్తారు.. మరుక్షణమే ఫిట్‌గా లేడని ప్రకటిస్తారు. దీంతో టీమిండియా అభిమానులు బుమ్రా విషయంలో బీసీసీఐ వైఖరిని తప్పుబడుతున్నారు. 'కనబడుట లేదు'(#Missing Bumrah) అంటూ ట్విటర్‌లో ట్రోల్స్‌, మీమ్స్‌తో రెచ్చిపోయారు అభిమానులు.

కేవలం ఐపీఎల్‌ కోసమే బుమ్రాను అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎంపిక చేయడం లేదని.. అటు బుమ్రా కూడా అంతర్జాతీయ క్రికెట్‌ కంటే ఐపీఎల్‌పైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా బుమ్రా ఫిట్‌నెస్‌ విషయమై బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీ నుంచి ఎలాంటి క్లియరెన్స్‌ రాలేదు. దీంతో బుమ్రా టీమిండియాలోకి ఎప్పుడు వస్తాడనేది చెప్పలేని పరిస్థితి. 

ఇక బుమ్రా ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి ఐదు నెలలు దాటిపోయింది. పెళ్లి తర్వాత వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు గాయంతో జట్టుకి దూరమయ్యాడు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో రెండు టి20 మ్యాచులు ఆడిన గాయం తిరగబెట్టడంతో టి20 ప్రపంచకప్‌ టోర్నీకి దూరమయ్యాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో తొలుత జస్ప్రిత్ బుమ్రాకి చోటు దక్కలేదు. ఆ తర్వాత కొన్నిరోజులకు బుమ్రా కోలుకున్నాడని, వన్డే సిరీస్‌కి ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించింది టీమిండియా... మూడు రోజులకు మళ్లీ బుమ్రా కోలుకోలేదంటూ టీమ్ నుంచి తప్పించింది.

అటుపై బుమ్రా లేకుండానే టీమిండియా ఆస్ట్రేలియాతో సిరీస్‌కు సిద్ధమైంది. అయితే బుమ్రా కోలుకుంటున్నాడని ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులు ఆడతాడని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇటీవలే ప్రకటించాడు. అయితే ఆదివారం బీసీసీఐ ఆసీస్‌తో జరిగే చివరి రెండు టెస్టులతో పాటు వన్డే సిరీస్‌కు ప్రకటించిన జట్టులో బుమ్రా పేరు ఎక్కడా కనిపించలేదు.

ఇక ఆసీస్‌తో సిరీస్‌ తర్వాత టీమిండియా ఆటగాళ్లు నేరుగా ఐపీఎల్‌లో అడుగుపెట్టనున్నారు. దీన్నిబట్టి చూస్తే గాయంతో దూరమైన బుమ్రా ఐపీఎల్‌ 2023 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలకు బుమ్రాని అందుబాటులో ఉంచేందుకు అతనికి రెస్ట్ ఇస్తున్నట్టు ప్రకటించిన బీసీసీఐ.. బుమ్రాను ఐపీఎల్‌లో ఆడడానికి కూడా అనుమతి ఇవ్వకూడదని సగటు అభిమాని అభిప్రాయపడుతున్నాడు. 

ఇదంతా వినడానికి బాగానే ఉన్నా.. టీమిండియా తరపున మూడు వన్డేలు ఆడేందుకు కూడా ఫిట్‌గా లేని బుమ్రా.. ఒకవేళ  ఐపీఎల్‌లో పాల్గొంటే ముంబై ఇండియన్స్ తరుపున 14 నుంచి 17 మ్యాచుల దాకా ఆడాల్సి ఉంటుంది. మూడు మ్యాచులు ఆడేందుకు లేని ఫిట్‌నెస్.. ఐపీఎల్‌లో అన్ని మ్యాచులు ఆడేందుకు ఎలా వస్తుంది? అనేది అంతుచిక్కని ప్రశ్నలా మారింది.

బుమ్రా ఎవరిని మోసం చేయాలనుకుంటున్నాడు.. దేశం కోసం ఆడాల్సింది పోయి డబ్బుల కోసం ఆడుకుంటే నష్టపోయేది అతనే అంటూ కొంతమంది అభిమానులు ఘాటుగా స్పందించారు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీల కోసం ఆస్ట్రేలియాతో టెస్టు, వన్డే సిరీస్‌ల నుంచి బుమ్రాని తప్పించిన బీసీసీఐ.. అతను ఐపీఎల్‌లో ఆడకుండా అడ్డుకోగలదా? అంటే సమాధానం మీ అందరికీ తెలిసిందే.

చదవండి: 'కోహ్లి ఏంటిది.. తగలరాని చోట తగిలి ఉంటే?'

వైస్‌ కెప్టెన్‌ హోదా తొలగింపు.. రాహుల్‌పై వేటు! దేశవాళీ క్రికెట్‌ ఆడితేనే..

మరిన్ని వార్తలు