IND Vs ENG: పాక్‌ ఓపెనర్లను మించిపోయిన బట్లర్‌, హేల్స్‌

10 Nov, 2022 16:37 IST|Sakshi

అంతా ఊహించినట్లే జరిగింది. ఆరంభం నుంచి టీమిండియాకు మైనస్‌గా కనిపిస్తూ వచ్చిన బౌలింగ్‌ విభాగం కీలకమైన సెమీస్‌ పోరులో పూర్తిగా చేతులెత్తేసింది. పైనల్‌ చేరతారనుకున్న టీమిండియా సెమీఫైనల్లో ఘోర పరాజయం చవిచూసి అవమానకర రీతిలో నిష్క్రమించింది. టీమిండియా బౌలర్లలో ఒక్క బౌలర్‌ నుంచి యార్కర్‌ బాల్‌ పడలేదంటే ఎంత పేలవమైన ఆటతీరు కనబరిచిందనేది అర్థం చేసుకోవచ్చు.

ఇక కళ్ల ముందు 169 పరుగుల లక్ష్యం కనిపిస్తున్నా టీమిండియా బౌలింగ్‌ను చూసి ఇంగ్లండ్‌ ఓపెనర్లు  ఇంచు కూడా బెదరలేదు. బట్లర్‌, అలెక్స్‌ హేల్స్‌ ఒకరితో ఒకరు పోటీ పడుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఈ ఇద్దరే కరిగించారంటే వారి బ్యాటింగ్‌ ఏ స్థాయిలో సాగిందనేది అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరి దాటికి ఇంగ్లండ్‌ 16 ఓవర్లలోనే వికెట్‌ కోల్పోకుండా చేధించింది. జాస్‌ బట్లర్‌ 80 నాటౌట్‌, అలెక్స్‌ హేల్స్‌ 86 నాటౌట్‌గా నిలిచి టీమిండియా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. 

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ చూస్తుంటే గతేడాది టి20 ప్రపంచకప్‌లో సూపర్‌-12 దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌ గుర్తుకుతెచ్చింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా విధించిన 152  పరుగుల లక్ష్యాన్ని పాక్ఘ ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా చేధించింది. మహ్మద్‌ రిజ్వాన్‌ 79 నాటౌట్‌, బాబర్‌ ఆజం 68 నాటౌట్‌ అప్పటి టీమిండియా బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ పాక్‌కు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు.

తాజాగా ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఈ రెండింటిలో కామన్‌గా ఉన్నది టీమిండియా అయితే.. జట్టు, స్కోర్లు మాత్రమే వేరు. మిగతాదంతా దాదాపు సేమ్‌ రిపీట్‌ అయింది. మరో విషయమేంటంటే బట్లర్‌, హేల్స్‌లు పాక్‌ ఓపెనర్లను మించిపోయారు. అప్పుడు పాక్‌ 17.1 ఓవర్లలో 152 పరుగుల లక్ష్యాన్ని అందుకుంటే.. తామేం తక్కువ తిన్నామా అన్నట్లుగా ఇంగ్లండ్‌ 16 ఓవర్లలోనే ఒక్క వికెట్‌ కోల్పోకుండా 169 పరుగుల టార్గెట్‌ను అందుకుంది.

చదవండి: పాండ్యా కోసం పంత్‌ త్యాగం..

మరిన్ని వార్తలు