BWF Rankings: ప్రపంచ నంబర్‌ వన్‌ షట్లర్‌గా భారత అమ్మాయి

8 Sep, 2022 10:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) అండర్‌–19 మహిళల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో కొత్త నంబర్‌వన్‌గా భారత్‌కు చెందిన అనుపమ ఉపాధ్యాయ అవతరించింది. హరియాణాలోని పంచ్‌కులాకు చెందిన 17 ఏళ్ల అనుపమ ఈ ఏడాది ఉగాండా, పోలాండ్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలలో విజేతగా నిలిచింది. టాప్‌ ర్యాంక్‌లో ఉన్న భారత్‌కే చెందిన తస్నిమ్‌ మీర్‌ను రెండో స్థానానికి నెట్టి అనుపమ అగ్రస్థానానికి చేరింది.

భారత్‌కే చెందిన అన్వేష గౌడ ఆరో ర్యాంక్‌లో, ఉన్నతి హుడా తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. బెంగళూరులోని ప్రకాశ్‌ పడుకోన్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న అనుపమ జూనియర్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన ఆరో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. గతంలో ఆదిత్య జోషి (2014), సిరిల్‌ వర్మ (2016), లక్ష్య సేన్‌ (2017), తస్నిమ్‌ (2022), శంకర్‌ సుబ్రమణియన్‌ (2022) ఈ ఘనత సాధించారు.      

మరిన్ని వార్తలు