BWF World Championships 2022: ప్రణయ్‌ సంచలనం

25 Aug, 2022 04:55 IST|Sakshi

ప్రపంచ రెండో ర్యాంకర్, రెండుసార్లు విశ్వవిజేత కెంటో మొమోటాపై విజయం

నేడు ప్రిక్వార్టర్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌తో ‘ఢీ’

రెండో రౌండ్‌లోనే ఓడిన శ్రీకాంత్‌

తనదైన రోజున ఎలాంటి ప్రత్యర్థినైనా హడలెత్తిస్తానని భారత అగ్రశ్రేణి షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ మరోసారి నిరూపించాడు. ఎంతో ప్రతిభ ఉన్నా.. తరచూ గాయాల బారిన పడుతూ...     ఆశించినన్ని విజయాలు అందుకోలేకపోయిన ఈ కేరళ ప్లేయర్‌ అడపాదడపా అద్భుత విజయాలతో అలరిస్తుంటాడు. తాజాగా ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో ప్రణయ్‌ పెను సంచలనం సృష్టించాడు.

రెండుసార్లు ప్రపంచ చాంపియన్, రెండో ర్యాంకర్, టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకడైన జపాన్‌ స్టార్‌ కెంటో మొమోటాను ప్రణయ్‌ వరుస గేముల్లో ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో గత ఏడాది కాంస్య పతక విజేత, భారత్‌కే చెందిన యువతార లక్ష్య సేన్‌తో ప్రణయ్‌ తలపడతాడు. గత సంవత్సరం రజత పతకం నెగ్గిన భారత స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ ఈసారి మాత్రం రెండో రౌండ్‌ అడ్డంకిని దాటలేకపోయాడు.   

టోక్యో: అత్యున్నత వేదికపై అద్భుత ఆటతీరుతో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ అదరగొట్టాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో ఈ కేరళ ఆటగాడు సంచలన విజయంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 2018, 2019 ప్రపంచ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ కెంటో మొమోటా (జపాన్‌)పై ప్రణయ్‌ వరుస గేముల్లో గెలిచి ఈ మెగా ఈవెంట్‌లో వరుసగా రెండో ఏడాది ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్‌ ప్రణయ్‌ 21–17, 21–16తో కెంటో మొమోటాను ఓడించాడు. గతంలో మొమోటాతో ఆడిన ఏడుసార్లూ ఓడిపోయిన ప్రణయ్‌ ఎనిమిదో ప్రయత్నంలో విజయం సాధించడం విశేషం. మొమోటాతో 54 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్‌ కీలకదశలో ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడి పాయింట్లు గెలిచాడు. తొలి గేమ్‌ ఆరంభంలో ఇద్దరూ 4–4తో సమంగా నిలిచారు. ఆ తర్వాత ప్రణయ్‌ వరుసగా రెండు పాయింట్లు గెలిచి 6–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం ఒక పాయింట్‌ కోల్పోయిన ప్రణయ్‌ మళ్లీ విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 10–5తో ముందంజ వేశాడు.

ఇదే దూకుడును కొనసాగిస్తూ ప్రణయ్‌ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌ మొదట్లో ప్రణయ్‌ 1–4తో వెనుకబడ్డాడు. కానీ వెంటనే తేరుకున్న ప్రణయ్‌ స్కోరును సమం చేశాడు. అనంతరం 8–6తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత మొమోటాకు పుంజుకునే అవకాశం ఇవ్వకుండా ప్రణయ్‌ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌తో ప్రణయ్‌ తలపడతాడు. మరో రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 36 నిమిషాల్లో 21–17, 21–10తో లూయిస్‌ ఎన్రిక్‌ పెనాల్వర్‌ (స్పెయిన్‌)పై గెలుపొందాడు.  

శ్రీకాంత్‌ అవుట్‌...
గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ ఈసారి మాత్రం రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 23వ ర్యాంకర్‌ జావో జున్‌ పెంగ్‌ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 9–21, 17–21తో ఓడిపోయాడు.  

పోరాడి ఓడిన శిఖా–అశ్విని జోడీ
మహిళల డబుల్స్‌లో భారత పోరాటం ముగిసింది. బుధవారం బరిలోకి దిగిన నాలుగు భారత జోడీలు రెండో రౌండ్‌లోనే నిష్క్రమించాయి. శిఖా గౌతమ్‌–అశ్విని భట్‌ 5–21, 21–18, 13–21తో ప్రపంచ నాలుగో ర్యాంక్‌ జోడీ కిమ్‌ సో యోంగ్‌–కాంగ్‌ హి యోంగ్‌ చేతిలో పోరాడి ఓడిపోయింది. సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 15–21, 10–21తో టాప్‌ సీడ్‌ చెన్‌ కింగ్‌ చెన్‌–జియా యి ఫాన్‌ (చైనా) చేతిలో... దండు పూజ–సంజన 15–21, 7–21తో మూడో సీడ్‌ లీ సో హీ–షిన్‌ సెయుంగ్‌ చాన్‌ (కొరియా) చేతిలో... పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ 8–21, 17–21తో పదో సీడ్‌ పియర్లీ తాన్‌–థినా మురళీధరన్‌ (మలేసియా) చేతిలో ఓడిపోయారు.   

ధ్రువ్‌–అర్జున్‌ జోడీ అద్భుతం
పురుషుల డబుల్స్‌లో భారత రెండు జోడీలు ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాయి. రెండో రౌండ్‌లో ధ్రువ్‌ కపిల–ఎం.ఆర్‌.అర్జున్‌ ద్వయం 21–17, 21–16తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్‌ జోడీ కిమ్‌ ఆస్‌ట్రప్‌–ఆండెర్స్‌ రస్‌ముసెన్‌ (డెన్మార్క్‌)పై సంచలన విజయం సాధించింది. మరో రెండో రౌండ్‌ మ్యాచ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం 21–8, 21–10తో సోలిస్‌ జొనాథన్‌–అనిబెల్‌ మార్‌క్విన్‌ (గ్వాటెమాలా) జోడీపై గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో జెప్‌ బే–లాసి మోల్డే (డెన్మార్క్‌)లతో సాత్విక్‌–చిరాగ్‌... హీ యోంగ్‌ కాయ్‌ టెరీ–లో కీన్‌ హీన్‌ (సింగపూర్‌)లతో అర్జున్‌–ధ్రువ్‌ ఆడతారు. 

మరిన్ని వార్తలు