BWF World Championships 2022: షటిల్‌ సమరం...

22 Aug, 2022 04:45 IST|Sakshi

నేటి నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌

లక్ష్య సేన్, శ్రీకాంత్‌లపైనే దృష్టి

డబుల్స్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీపైనా ఆశలు

ఉదయం గం. 7:30 నుంచి స్పోర్ట్స్‌–18, డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

థామస్‌ కప్‌లో చారిత్రక విజయం... కామన్వెల్త్‌ గేమ్స్‌లో పతకాల పంట... ఈ రెండు గొప్ప ప్రదర్శనల తర్వాత భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు మరో ప్రతిష్టాత్మక పోరుకు సిద్ధమయ్యారు.

నేటి నుంచి జపాన్‌ రాజధాని టోక్యోలో మొదలయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌లో పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాలలో కలిపి మొత్తం 26 మంది భారత క్రీడాకారులు సత్తా చాటుకునేందుకు సై అంటున్నారు.

ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో అత్యధికంగా ఐదు పతకాలు గెలిచిన భారతీయ ప్లేయర్‌గా ఘనత వహించిన స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు గాయం కారణంగా తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనడం లేదు. 2011 నుంచి జరిగిన ప్రతి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కనీసం ఒక్క పతకమైనా లభిస్తోంది.

టోక్యో: అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ వేదికపై గత పదిహేనేళ్లుగా నిలకడగా రాణిస్తూ... ‘బ్యాడ్మింటన్‌ పవర్‌హౌస్‌’గా భావించే చైనా, ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్, కొరియా, జపాన్‌ దేశాలకు దీటుగా ఎదిగిన భారత క్రీడాకారులు మరో సమరానికి సిద్ధమయ్యారు. తొలిసారి ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు ఆతిథ్యమిస్తున్న జపాన్‌ గడ్డపై భారత ఆటగాళ్లు పతకాలు సాధించాలని పట్టుదలతో ఉన్నారు.

మహిళల సింగిల్స్‌లో స్టార్‌ క్రీడాకారిణి పీవీ సింధు మినహా మిగతా అగ్రశ్రేణి క్రీడాకారులు భారత్‌ తరఫున బరిలో ఉన్నారు. గత ఏడాది స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ రజతం, లక్ష్య సేన్‌ కాంస్యం సాధించి సంచలనం సృష్టించగా... కేరళ ప్లేయర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన సాయిప్రణీత్‌తోపాటు ఈసారి శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్‌లపై భారత్‌ ఆశలు పెట్టుకుంది.

నేడు జరిగే పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)తో 20వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌... 39వ ర్యాంకర్‌ ఎన్‌హట్‌ ఎన్గుయెన్‌ (ఐర్లాండ్‌)తో 13వ ర్యాంకర్‌ కిడాంబి శ్రీకాంత్‌... 19వ ర్యాంకర్‌ విటింగస్‌ (డెన్మార్క్‌)తో 10వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌... 94వ ర్యాంకర్‌ లుకా వ్రాబెర్‌ (ఆస్ట్రియా)తో 18వ ర్యాంకర్‌ ప్రణయ్‌ తలపడనున్నారు. సాయిప్రణీత్‌ ‘డ్రా’ పై భాగంలో... శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్‌ ముగ్గురూ ‘డ్రా’ కింది భాగంలో ఉన్నారు. దాంతో శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్‌లలో ఒక్కరు మాత్రమే సెమీఫైనల్‌ చేరుకోగలరు.

ఈ ముగ్గురికీ క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. పతకాలు సాధించాలంటే వీరందరూ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. ఇటీవల కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించి లక్ష్య సేన్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. చౌ తియెన్‌ చెన్‌తో ఆడిన నాలుగుసార్లూ సాయిప్రణీత్‌ ఓడిపోవడం... కొన్నాళ్లుగా ఫామ్‌లో లేకపోవడంతో సాయిప్రణీత్‌ తొలి రౌండ్‌ అడ్డంకి దాటడం అనుమానమే. డిఫెండింగ్‌ చాంపియన్‌ లో కీన్‌ యు (సింగపూర్‌), మాజీ చాంపియన్స్‌ కెంటో మొమోటా (జపాన్‌), అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌), జిన్‌టింగ్‌ (ఇండోనేసియా), లీ జి జియా (మలేసియా) టైటిల్‌ ఫేవరెట్స్‌గా ఉన్నారు.  

సైనా మెరిసేనా...
మహిళల సింగిల్స్‌లో ఈసారి భారత్‌ నుంచి ఇద్దరే బరిలో ఉన్నారు. గాయం కారణంగా పీవీ సింధు వైదొలగగా... సైనా నెహ్వాల్, మాళవిక బన్సోద్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. నేడు జరిగే తొలి రౌండ్‌లో లినె క్రిస్టోఫెర్సన్‌ (డెన్మార్క్‌)తో మాళివిక... మంగళవారం జరిగే తొలి రౌండ్‌లో చెయుంగ్‌ ఎన్గాన్‌ యి (వియత్నాం)తో సైనా ఆడతారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 12వసారి ఆడుతున్న సైనా 2015లో రజతం, 2017లో కాంస్యం గెలిచింది.

అయితే ఈ ఏడాది సైనా గొప్ప ఫామ్‌లో లేదు. ఈ సీజన్‌లో ఆమె తొమ్మిది టోర్నీలలో ఆడితే ఏ టోర్నీలోనూ క్వార్టర్‌ ఫైనల్‌ దాటి ముందుకెళ్లలేకపోయింది. మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ అకానె యామగుచి (జపాన్‌),  రెండో సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ), మూడుసార్లు చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌), ఆన్‌ సె యంగ్‌ (కొరియా), చెన్‌ యు ఫె, హి బింగ్‌ జియావో (చైనా) టైటిల్‌ ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నారు.  

ఆ ఇద్దరిపైనే...
పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఇప్పటివరకు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం రాలేదు. అంతా సవ్యంగా సాగితే ఈసారి సాత్విక్‌ సాయిరాజ్‌–     చిరాగ్‌ శెట్టి ద్వయం ఆ లోటు తీర్చే అవకాశముంది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన    సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. ఇక మహిళల డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత్‌కు అంతగా పతకావకాశాలు లేవు.  

భారత ఆటగాళ్ల వివరాలు
పురుషుల సింగిల్స్‌: లక్ష్య సేన్, శ్రీకాంత్, ప్రణయ్, సాయిప్రణీత్‌.
మహిళల సింగిల్స్‌: సైనా నెహ్వాల్, మాళవిక.
పురుషుల డబుల్స్‌: సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి, సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి, అర్జున్‌–ధ్రువ్‌ కపిల, కృష్ణప్రసాద్‌–విష్ణువర్ధన్‌ గౌడ్‌.
మహిళల డబుల్స్‌: సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప, దండు పూజ–సంజన, పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, అశ్విని భట్‌–శిఖా.
మిక్స్‌డ్‌ డబుల్స్‌: ఇషాన్‌–తనీషా క్రాస్టో, వెంకట్‌ గౌరవ్‌ ప్రసాద్‌–జూహీ దేవాంగన్‌.

మన పతక విజేతలు..
1983: ప్రకాశ్‌ పడుకోన్‌ (పురుషుల సింగిల్స్‌లో
కాంస్యం); 2011: గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప (మహిళల డబుల్స్‌లో కాంస్యం); 2013: సింధు (మహిళల సింగిల్స్‌లో కాంస్యం); 2014: సింధు (మహిళల సింగిల్స్‌లో కాంస్యం); 2015: సైనా (మహిళల సింగిల్స్‌లో రజతం); 2017: సింధు (మహిళల సింగిల్స్‌లో రజతం); 2017: సైనా  (మహిళల సింగిల్స్‌లో కాంస్యం); 2018: సింధు (మహిళల సింగిల్స్‌లో రజతం); 2019: సింధు (మహిళల సింగిల్స్‌లో స్వర్ణం); 2019: సాయిప్రణీత్‌ (పురుషుల సింగిల్స్‌లో కాంస్యం); 2021: శ్రీకాంత్‌ (పురుషుల సింగిల్స్‌లో రజతం); 2021: లక్ష్య సేన్‌ (పురుషుల సింగిల్స్‌లో కాంస్యం).

మరిన్ని వార్తలు