అదే జరిగితే చారిత్రక సిరీస్‌ రద్దు.. తాలిబన్లకు క్రికెట్‌ ఆస్ట్రేలియా వార్నింగ్‌

9 Sep, 2021 15:42 IST|Sakshi

కాబుల్‌: అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల వశమైన నాటి నుంచి అక్కడ అరచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. కఠినమైన షరియా చట్టాల పేరుతో తాలిబన్లు మహిళల హక్కులను కాలరాస్తున్నారు. తాజాగా అఫ్గాన్ మహిళలు.. క్రికెట్‌ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనకూడదని తాలిబన్‌ ప్రభుత్వం ఫత్వా జారీ చేసింది. క్రీడల్లో పాల్గొన్నప్పుడు మహిళల శరీర భాగాలు బహిర్గతం అవుతాయన్న కారణంగా క్రీడలపై నిషేధం విధిస్తున్నట్లు వారు బుధవారం ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో మహిళల క్రికెట్‌ను రద్దు చేయరాదంటూ క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) గురువారం తాలిబన్‌ ప్రభుత్వాన్ని కోరింది. తాలిబన్లు మహిళల క్రికెట్‌ను నిర్వీర్యం చేయాలనుకుంటే.. తమ జట్టుతో నవంబర్‌ 27న జరగాల్సి ఉన్న చారిత్రక టెస్ట్‌ మ్యాచ్‌ను రద్దు చేసుకుంటామని బెదిరింపులకు దిగింది. ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్‌ అభివృద్ది చెందాలన్నదే తమ ఉద్దేశమని, మహిళల క్రికెట్‌కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొంది.  

ఇదిలా ఉంటే, మహిళల క్రికెట్‌పై అంక్షలు విధించిన తాలిబన్‌ ప్రభుత్వం పురుషుల క్రికెట్‌కు సంపూర్ణ మద్దతు తేలియజేయడం విశేషం. పురుషుల క్రికెట్‌ విషయాల్లో తల దూర్చబోరని స్పష్టమైన హామీనిచ్చిన తాలిబన్లు.. అంతర్జాతీయ షెడ్యూల్‌ ప్రకారం యధావిధిగా మ్యాచ్‌లు ఆడవచ్చని, తమవైపు నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండబోదని అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డుకు భరోసా ఇచ్చారు. తమకు ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు ముఖ్యమని, తమ దేశ క్రికెట్‌ జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లినా, విదేశీ జట్లు తమ దేశానికి వచ్చినా ఎటువంటి అభ్యంతరాలు ఉండబోవని స్పష్టం చేసిన తాలిబన్లు మహిళల క్రికెట్‌ విషయంలో మాత్రం తమ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. 
చదవండి: ఇకపై అక్కడ మహిళల 'ఆటలు' సాగవు..

మరిన్ని వార్తలు