WTC Final: టీమిండియాకు ఇదేమి కొత్తకాదు.. గెలిచే ఛాన్స్‌ ఉందా? కనీసం డ్రా అయినా

9 Jun, 2023 12:37 IST|Sakshi

లండన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో భారత జట్టు విఫలమైంది. ముఖ్యంగా భారత టాపర్డర్‌ కుప్పకూలింది.  రోహిత్‌ శర్మ(15), విరాట్‌ కోహ్లి(14), పుజారా(14), గిల్‌(13) వంటి కీలక ఆటగాళ్లు నిరాశపరిచారు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది.  ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉంది. ఇక అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌటైంది.  

టీమిండియాకు ఇదేమి కొత్తకాదు..
ఇక టెస్టు మ్యాచ్‌ల్లో టాపర్డర్‌ విఫలం కావడం భారత జట్టుకు ఇదేమి కొత్త కాదు. గత రెండేళ్లలో కొన్ని టెస్టుల్లో టాపర్డర్‌ విఫలమైనప్పటికీ.. లోయార్డర్‌ ఆటగాళ్లు అద్భుతంగా రాణించి జట్టును అదుకున్న సందర్భాలు చాలా  ఉన్నాయి. ముఖ్యంగా రవీంద్ర జడేజా, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ త్రయం చాలా మ్యాచ్‌ల్లో లోయార్డర్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే ఈ త్రయంలో జడేజా ఇప్పటికే పెవిలియన్‌కు చేరగా.. పంత్‌, అయ్యర్‌ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేరు.

టీమిండియా విజేతగా నిలవాలంటే? 
భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కంటే ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానే(29), కేఎస్‌ భరత్‌(5) ఉన్నారు.  ఇప్పటికి ఇంకా టీమిండియా గెలుపు దారులు మూసుకుపోలేదు. కానీ భారత్‌ విజేతగా నిలవాలంటే అద్భుతాలు జరగాలి. అంతకంటే ముందు రోహిత్‌ సేన ఫాలో ఆన్‌ గండం తప్పంచుకోవాలి.

భారత్‌ ఫాలో ఆన్‌కుండా ఉండాలంటే మరో 118 పరుగులు అవసరం. మూడో రోజు రహానే, కెఎస్‌ భరత్‌ ఎంత వరకు ఆసీస్‌ బౌలర్లను ఎదుర్కొంటురన్నదానిపై టీమిండియా భవిష్యత్తు ఆధానపడి ఉంది. రహానేకు విదేశీ పిచ్‌లపై మంచి ట్రాక్‌ రికార్డు ఉంది కాబట్టి.. అతడి సీనియారిటీని మరోసారి నిరూపించకోవాల్సిన సమయం అసన్నమైంది.

మరోవైపు క్రీజులో ఉన్న శ్రీకర్‌ భరత్‌ కూడా పంత్‌లా చెలరేగి ఆడాలి. వీరిద్దరూ భారత స్కోర్‌ బోర్డును 300 పరుగులు వరకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే.. అనంతరం శార్ధూల్‌ ఠాకూర్‌కు కూడా బ్యాటింగ్‌ చేసే సత్తా ఉంది కాబట్టి టీమిండియా మ్యాచ్‌లో నిలిచే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు భారత తమ తొలి ఇన్నింగ్స్‌లో 350 పరుగులకు ఆలౌటైతే.. ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 119 పరుగుల ఆధిక్యం లభిస్తోంది.

ఈ క్రమంలో  సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించి ఆసీస్‌ను తక్కువ పరుగులకే కట్టడిచేస్తే.. టార్గెట్‌ను టీమిండియా ఛేదించే ఛాన్స్‌ ఉంటుంది.కాగా ఈ మ్యాచ్‌లో విజయం కోసం కాకపోయినా కనీసం డ్రా కోసం టీమిండియా ప్రయత్నించాలి. మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే ఇరుజట్లను సంయుక్త విజేతలగా ప్రకటిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితులును చూస్తే ఆస్ట్రేలియానే ఫేవరేట్‌గా కన్పిస్తోంది.
చదవండిWTC Final: అదృష్టమంటే రహానేదే.. అవుటై కూడా బతికిపోయాడు! వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు