Rohit Sharma: ఎక్కడైనా గెలవగలం.. మా బలం అదే: గంగూలీకి కౌంటర్‌?!

19 Feb, 2024 12:56 IST|Sakshi
రోహిత్‌ శర్మ (PC: BCCI)

ఎలాంటి పిచ్‌ల మీదైనా గెలవగల సత్తా టీమిండియాకు ఉందని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. సౌతాఫ్రికాలో టెస్టు మ్యాచ్‌ గెలవడమే ఇందుకు నిదర్శమని పేర్కొన్నాడు. ఇలాంటి పిచ్‌లే కావాలని పట్టుబట్టే రకం తాము కాదని.. అయినా పిచ్‌ రూపకల్పన పూర్తిగా క్యూరేటర్‌ నిర్ణయమని పేర్కొన్నాడు.

ఇంగ్లండ్‌తో తాజా సిరీస్‌లో ఇప్పటి వరకు ఆడిన మూడు టెస్టుల్లో భిన్న సవాళ్లకు ఎదురొడ్డి విజయాలు నమోదు చేస్తున్నామని జట్టును ప్రశంసించాడు. కాగా ఉపఖండ పిచ్‌లు సాధారణంగా స్పిన్‌కు అనుకూలిస్తాయన్న విషయం తెలిసిందే. అదే విధంగా విదేశాల్లో ముఖ్యంగా సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా పిచ్‌లు ఫాస్ట్‌ బౌలర్లకు స్వర్గధామంగా ఉంటాయి.

అయితే, ఇంగ్లండ్‌ భారత గడ్డపై టెస్టులు ఆడుతున్నపుడల్లా.. ముఖ్యంగా గత సిరీస్‌ సమయంలో మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే ముగిసిపోవడంతో మైకేల్‌ వాన్‌ వంటి మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. టీమిండియాకు అనుకూల పిచ్‌లు రూపొందించారంటూ .. బంతి ఇంతలా టర్న్‌ అవడం ఏమిటని ప్రశ్నించారు.

సొంతగడ్డపై ఆడుతున్నపుడు హోం టీమ్‌కు కాస్త అడ్వాంటేజ్‌ ఉంటుందనే విషయాన్ని మరిచి టీమిండియా ప్రతిభను తక్కువ చేసేలా మాట్లాడారు. ఈ క్రమంలో ఇటీవల భారత మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ బాస్‌ సౌరవ్‌ గంగూలీ సైతం ర్యాంక్‌ టర్నర్స్‌(స్పిన్‌ అనుకూల పిచ్‌లు) మాత్రమే ఎందుకు తయారు చేస్తున్నారని ప్రశ్నించాడు.

జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌ వంటి వరల్డ్‌క్లాస్‌ పేసర్లు జట్టులో ఉన్నారని.. వాళ్లు కూడా స్పిన్నర్ల మాదిరే పది వికెట్లు తీస్తే చూడాలని ఉందని దాదా పేర్కొన్నాడు. ఈ విషయంపై ఇప్పటికే హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పందించగా.. మూడో టెస్టు ముగిసిన తర్వాత రోహిత్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం రెస్పాండ్‌ అయ్యాడు.

ఈ మేరకు.. ‘‘ఇలాంటి పిచ్‌లపై మేము గతంలో చాలా మ్యాచ్‌లు గెలిచాం. నిజానికి బంతి టర్న్‌ అయితే.. దానిని మాకు అనుకూలంగా మార్చుకోవడం మాకున్న బలం. జట్టు సమతూకంగా ఉండటానికి ఇది దోహదం చేస్తుంది.

అయితే, పిచ్‌ ఎలా ఉండాలన్న అంశాన్ని మేము డిసైడ్‌ చేయం కదా! మ్యాచ్‌కు రెండు రోజుల ముందు వేదిక దగ్గరకు వస్తాం. ఆ రెండు రోజుల్లో మేము ఎలాంటి మార్పులు చేయగలం. క్యూరేటర్ల నిర్ణయానుసారమే పిచ్‌ రూపకల్పన జరుగుతుంది.

అయితే, వికెట్‌ ఎలా ఉన్నా ఆడి గెలవడమే మా బలం. సౌతాఫ్రికాలో కేప్‌టౌన్‌ టెస్టులో ఎలాంటి పిచ్‌ మీద మేము అద్భుత విజయం సాధించామో చూశారు కదా! ఈ సిరీస్‌లో గత మూడు టెస్టుల్లో భిన్న సవాళ్లు ఎదుర్కొన్నాం. హైదరాబాద్‌లో బాల్‌ స్పిన్‌ అయింది. వికెట్‌ కాస్త స్లోగా ఉంది. వైజాగ్‌లో మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ మరింత స్లోగా మారింది.

ఇక్కడ తొలి మూడు రోజులు కూడా బాగానే ఉంది. నాలుగో రోజు మాత్రం కాస్త ఎక్కువగా టర్న్‌ అయింది. ఇండియాలో పిచ్‌లు ఇలాగే ఉంటాయి’’ అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. పిచ్‌ స్వభావాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టే తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులు చేసిన రవీంద్ర జడేజా అద్బుత స్పెల్‌(5/41) కూడా వేశాడని రోహిత్‌ ఈ సందర్భంగా ప్రశంసించాడు. 

కాగా రాజ్‌కోట్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై 434 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన టీమిండియా.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం 2-1తో ముందంజలో ఉంది.  ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు జరుగనుంది.

చదవండి: Ind vs Eng: అతడి ఇన్నింగ్స్‌ అద్భుతం.. సిరీస్‌ గెలిచి తీరతాం: స్టోక్స్‌

whatsapp channel

మరిన్ని వార్తలు