ATP World Rankings: చరిత్ర సృష్టించిన స్పెయిన్‌ యువ కెరటం కార్లోస్‌ అల్‌కరాజ్‌

17 Nov, 2022 07:09 IST|Sakshi

ఏడాదిని నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించనున్న స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ 

ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు  

ట్యురిన్‌ (ఇటలీ): అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో స్పెయిన్‌ టీనేజర్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ కొత్త చరిత్ర లిఖించాడు. 1973లో అధికారికంగా ర్యాంకింగ్స్‌ మొదలయ్యాక నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ఏడాదిని ముగించనున్న పిన్న వయస్కుడిగా 19 ఏళ్ల అల్‌కరాజ్‌ గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు లీటన్‌ హెవిట్‌ (ఆస్ట్రేలియా; 2001లో 20 ఏళ్ల 214 రోజులు) పేరిట ఉన్న ఈ రికార్డును అల్‌కరాజ్‌ తిరగరాశాడు.  

  • గాయం కారణంగా అల్‌కరాజ్‌ సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌కు దూరమయ్యాడు. మరోవైపు ఈ టోర్నీలో టైటిల్‌ సాధిస్తే స్పెయిన్‌ దిగ్గజం, ప్రపంచ రెండో ర్యాంకర్‌ రాఫెల్‌ నాదల్‌ మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ అందుకోవడంతోపాటు సీజన్‌ను టాప్‌ ర్యాంక్‌తో ముగించేవాడు. కానీ నాదల్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ప్రస్తుతం నంబర్‌వన్‌గా ఉన్న అల్‌కరాజ్‌ (6,820 పాయింట్లు) డిసెంబర్‌ 5న ముగిసే టెన్నిస్‌ సీజన్‌ను టాప్‌ ర్యాంక్‌తో ముగించడం ఖరారైంది.  
  • ఈ ఏడాదిని 32వ ర్యాంక్‌తో ప్రారంభించిన అతను సెప్టెంబర్‌ 12న నంబర్‌వన్‌ ర్యాంకర్‌గా ఎదిగాడు. పిన్న వయస్కులో టాప్‌ ర్యాంక్‌ అందుకున్న టెన్నిస్‌ ప్లేయర్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు.  
  • ఈ సంవత్సరం అల్‌కరాజ్‌ ఐదు సింగిల్స్‌ టైటిల్స్‌ (రియోఓపెన్, మయామి మాస్టర్స్, బార్సిలోనా ఓపెన్, మాడ్రిడ్‌ మాస్టర్స్, యూఎస్‌ ఓపెన్‌) సాధించాడు. మొత్తం 57 మ్యాచ్‌ల్లో గెలిచి, 13 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. 76 లక్షల 27 వేల 613 డాలర్ల (రూ. 62 కోట్లు) ప్రైజ్‌మనీ సంపాదించాడు.  
  • ఏటీపీ ర్యాంకింగ్స్‌ చరిత్రలో సీజన్‌ను నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించనున్న 18వ ప్లేయర్‌ అల్‌కరాజ్‌. 2003 తర్వాత బిగ్‌–4 ప్లేయర్లు (ఫెడరర్, నాదల్, జొకోవిచ్, ఆండీ ముర్రే) కాకుండా మరో ప్లేయర్‌ టాప్‌ ర్యాంక్‌తో ముగించడం ఇదే ప్రథమం. నాదల్‌ తర్వాత స్పెయిన్‌ నుంచి ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా అల్‌కరాజ్‌ నిలిచాడు.    
మరిన్ని వార్తలు