Carlos Braithwaite: 'చేసిన పాపం ఊరికే పోదు'.. బౌలర్‌ తిక్క కుదిర్చిన అంపైర్‌

21 Jun, 2022 13:50 IST|Sakshi

'చేసిన పాపం ఊరికే పోదంటారు'' పెద్దలు. తాజాగా విండీస్‌ స్టార్‌ క్రికెటర్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ విషయంలో అదే జరిగింది. త్రో విసిరే సమయంలో  బంతిని బ్యాటర్‌వైపు ఉద్దేశపూర్వకంగానే కొట్టినట్లు రుజువు కావడంతో బ్రాత్‌వైట్‌ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తూ అంపైర్‌ నిర్ణయం తీసుకున్నాడు. విషయంలోకి వెళితే.. విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో భాగంగా వార్విక్‌షైర్‌, డెర్బీషైర్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది.

డెర్బీషైర్‌ ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ బ్రాత్‌వైట్‌ వేశాడు. 34 పరుగులతో క్రీజులో వేన్‌ మాడ్సన్‌ ఉన్నాడు. ఆ ఓవర్‌ మూడో బంతిని బ్రాత్‌వైట్‌ యార్కర్‌ వేయగా.. మాడ్సన్‌ బంతిని ముందుకు పుష్‌ చేశాడు. బంతిని అందుకున్న బ్రాత్‌వైట్‌ త్రో విసిరే ప్రయత్నం చేయగా.. బంతి మాడ్సన్‌ పాదానికి  గట్టిగా తగిలింది. నాన్‌స్ట్రైకర్‌ కాల్‌ ఇవ్వడంతో సింగిల్‌ పూర్తి చేశారు. బ్రాత్‌వైట్‌ కూడా మాడ్సన్‌ను క్షమాపణ కోరాడు. ఇక్కడితో దీనికి ఫుల్‌స్టాప్‌ పడిందని అంతా భావించారు.

కానీ ఇదంతా గమనించిన ఫీల్డ్‌ అంపైర్‌ బ్రాత్‌వైట్ చేసింది తప్పని.. అందుకు శిక్షగా ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపాడు. లెగ్‌ అంపైర్‌తో విషయం చర్చించాకా బంతిని కూడా డెడ్‌బాల్‌గా పరిగణిస్తూ.. ప్రత్యర్థి జట్టు తీసిన సింగిల్‌ను కూడా అంపైర్లు రద్దు చేశారు. దీంతో ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు అదనంగా వచ్చాయి. ఇక బ్రాత్‌వైట్‌ అనవసరంగా గెలుక్కొని​ మూల్యం చెల్లించుకున్నట్లు.. ఆ ఓవర్‌లో ఎనిమిది పరుగులు సహా ఐదు పెనాల్టీ పరుగులతో మొత్తంగా 13 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే డెర్బీషైర్‌ వార్విక్‌షైర్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వార్విక్‌ షైర్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన డెర్బీషైర్‌ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

చదవండి: అరుదైన సెంచరీల రికార్డు.. సచిన్‌ సర్‌తో పాటు నా పేరు కూడా: యశస్వి

Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్‌.. రొనాల్డో క్షేమంగానే

మరిన్ని వార్తలు