చహల్‌ పేరెంట్స్‌కు కరోనా.. తండ్రి పరిస్థితి సీరియస్‌

13 May, 2021 16:58 IST|Sakshi

ఢిల్లీ: టీమిండియా యువ ఆటగాడు యజ్వేంద్ర చహల్‌ పేరెంట్స్‌ కరోనా బారీన పడ్డారు. ఈ విషయాన్ని చహల్‌ భార్య ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. చహల్‌ తల్లి స్వల్ప లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో ఉండగా.. చహల్‌ తండ్రికి మాత్రం లక్షణాలు ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రిలో జాయిన్‌ చేశారు.

ఇదే విషయంపై ధనశ్రీ మాట్లాడుతూ.. ''మా మామగారు, అత్తగారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అత్తయ్య స్వల్ప లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో ఉండగా.. మామయ్య పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉండడంతో ఆసుపత్రిలో జాయిన్‌ చేశాం. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. బయట పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందరూ ఇంట్లోనే ఉండండి.. మాస్క్‌ ధరించి క్షేమంగా ఉండండి'' అంటూ చెప్పుకొచ్చింది. 

ఇటీవలే మాజీ క్రికెటర్లు పియూష్‌ చా‍వ్లా, ఆర్‌పీ సింగ్‌లు కరోనాతో తన తండ్రులను కోల్పోయారు. ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌ తాత్కాలికంగా రద్దు కావడంతో చహల్‌ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే జూన్‌లో జరగనున్న ప్రపంచటెస్టు చాంపియన్‌ ఫైనల్‌కు చహల్‌ ఎంపిక కాలేదు. అయితే జూలైలో శ్రీలంకలో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లో చహల్‌ ఆడే అవకాశాలు ఉన్నాయి.

ఇక దేశంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతున్నది.గత 24 గంటల్లో 18,64,594 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 3,62,727 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,37,03,665కు పెరిగింది. దేశంలో ఒక్కరోజులోనే ఏకంగా 4,120 మంది కోవిడ్‌తో మరణించారు. దీంతో కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య  2,58,317కు చేరింది. ఇక కరోనా నుంచి రికార్డుస్థాయిలో 3,52,181 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 1,97,34,823 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.
చదవండి: Corona: టీటీ మాజీ ప్లేయర్‌ చంద్రశేఖర్‌ మృతి

మరిన్ని వార్తలు