LPL 2022: మూతిపళ్లు రాలినా క్యాచ్‌ మాత్రం విడువలేదు

8 Dec, 2022 15:12 IST|Sakshi

లంక ప్రీమియర్‌ లీగ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్యాచ్‌ తీసుకునే క్రమంలో మూతి పళ్లు రాలగొట్టుకున్నాడు లంక క్రికెటర్‌ చమిక కరుణరత్నే. కాండీ ఫాల్కన్స్‌, గాలె గ్లాడియేటర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. గాలె గ్లాడియేటర్‌ ఇన్నింగ్స్‌ సమయంలో బ్యాటర్‌ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునేందుకు కరుణరత్నే పరిగెత్తుకొచ్చాడు.

అదే సమయంలో మరో ఇద్దరు ఫీల్డర్లు కూడా రావడం చూసిన కరుణరత్నే వారిని వద్దని వారించాడు. ఇక క్యాచ్‌ను సులువుగా పట్టుకున్నట్లే అని మనం అనుకుంటున్న దశలో బంతి అతని మూతిపై బలంగా తాకింది. ఆ దెబ్బకు అతని ముందు పళ్లు ఊడివచ్చాయి. నోటి నుంచి రక్తం కారుతున్నప్పటికి క్యాచ్‌ను మాత్రం జారవిడవలేదు. ఆ తర్వాత పెవిలియన్‌ వెళ్లి ప్రథమ చికిత్స తీసుకొని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. కాండీ ఫాల్కన్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గాలే గ్లాడియేటర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మోవిన్‌ శుభసింగా 38 బంతుల్లో 40 పరుగులు, ఇమాద్‌ వసీమ్‌ 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన ఫాల్కన్స్‌ 30 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. కమిందు మెండిస్‌ 44, పాతుమ్‌ నిస్సాంక(22), ఆండ్రీ ఫ్లెచర్‌(20) పరుగులు చేశారు. 

చదవండి: క్రిప్టో కరెన్సీ కంటే దారుణంగా పడిపోతున్నారు.. టీమిండియాపై సెహ్వాగ్‌ సెటైర్‌

మరిన్ని వార్తలు