‘మీ కోసం మళ్లీ ఆడతా’

31 May, 2023 03:48 IST|Sakshi

అభిమానులకు ధోని సంకేతం 

వచ్చే ఏడాదీ ఐపీఎల్‌ ఆడే అవకాశాలు! 

అహ్మదాబాద్‌: మూడేళ్ల క్రితం ఐపీఎల్‌లో ఇదే ప్రశ్న...రెండేళ్ల క్రితం టైటిల్‌ గెలిచాక ఇదే ప్రశ్న...గత ఏడాది టీమ్‌ ఘోరంగా విఫలమైనప్పుడు మళ్లీ అదే ప్రశ్న...ఇప్పుడు ఐదో సారి చాంపియన్‌గా నిలిచాక పాత సందేహమే కొత్తగా..! మహేంద్ర సింగ్‌ ధోని ఐపీఎల్‌ నుంచి రిటైర్‌ అవుతున్నాడా, ఈ సారి అద్భుత ప్రదర్శనతో జట్టును విజేతగా నిలిపిన తర్వాత తప్పుకుంటున్నాడా అని అభిమానుల్లో ఉత్సుకత.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ 2023 చాంపియన్‌గా నిలిచిన తీరును చూస్తే ధోనికి ఇంతకంటే ఘనమైన వీడ్కోలు ఉండదనిపిస్తోంది. కానీ అతని మాట చూస్తే మళ్లీ వచ్చి ఆడతాడనిపిస్తోంది. ఫైనల్‌ ముగిసిన తర్వాత ధోని రిటైర్మెంట్‌పై ఎప్పటిలాగే తనదైన శైలిలో ఆసక్తికర సమాధానమిచ్చాడు. ‘ఇప్పుడు నేను ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే రిటైర్మెంట్‌ను ప్రకటించడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. ఒక్క మాటలో థ్యాంక్యూ అని చెప్పి నేను తప్పుకోవచ్చు.

కానీ వచ్చే 9 నెలల పాటు కష్టపడి మరో ఐపీఎల్‌ ఆడటం మాత్రం అంత సులువు కాదు. అయితే చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులు నాపై కురిపిస్తున్న ప్రేమను చూస్తే మరో సీజన్‌ ఆడటం వారికి కానుక అందించినట్లవుతుంది. వాళ్ల  అభిమానం, భావోద్వేగాలు చూస్తే వారి కోసం ఇదంతా చేయాలనిపిస్తోంది’ అని ధోని వ్యాఖ్యానించాడు. తాను కెరీర్‌ చివరి రోజుల్లో ఉన్నాననే విషయం వారికీ తెలుసని, అందుకే ఎక్కడకు వెళ్లినా తనకు ప్రేక్షకులనుంచి భారీ మద్దతు లభించిందని ధోని గుర్తు చేసుకున్నాడు.

‘ఇదే మైదానంలో సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడాను. అంతా నా పేరును మైదానంలో మారుమోగించారు. చెన్నైలో మాత్రమే కాకుండా ఇలా అన్ని చోట్లా స్పందన చూస్తే నేను  ఆడగలిగినంత ఆడాలనిపించింది’ అని మహి పేర్కొన్నాడు. కెపె్టన్‌గా తన ఐదు ఐపీఎల్‌ ట్రోఫీ విజయాల్లో ప్రతీది భిన్నమైందని, ఒకదాంతో మరోదానికి పోలిక లేదని, పరిస్థితులను బట్టి అన్ని  మారతాయని ధోని అభిప్రాయ పడ్డాడు.

‘ప్రతీ ట్రోఫీ గెలుపు, ప్రతీ ద్వైపాక్షిక సిరీస్‌ విజయానికి వేర్వేరు సవాళ్లు ఉంటాయి. ఏదీ ఒకే తరహాలో మూసగా ఉండదు. అందుకే ఆందోళన చెందకుండా పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటా. ఇలాంటి టోరీ్నల్లో కీలక క్షణాలు కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు ఎలా ఒత్తిడిని ఎదుర్కొంటామనేదే  కీలకం. ఈ విషయంలో అందరూ భిన్నంగా ఉంటారు. రహానేలాంటి అనుభవజు్ఞలకు సమస్య రాదు కానీ కుర్రాళ్లను సరైన విధంగా నడిపించాల్సి ఉంటుంది’ అంటూ తన శైలిని వెల్లడించాడు.  

మరిన్ని వార్తలు