Ranji Trophy 2022 Final: కెప్టెన్‌గా సాధించలేనిది కోచ్‌ పాత్రలో.. అందుకే ఆ కన్నీళ్లు

26 Jun, 2022 15:58 IST|Sakshi

రంజీ ట్రోఫీ కొత్త విజేతగా మధ్యప్రదేశ్‌ అవతరించింది. మధ్యప్రదేశ్‌ జట్టుకు ఇదే మెయిడెన్‌ రంజీ ట్రోఫీ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1998-99 రంజీ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన మధ్యప్రదేశ్‌ మళ్లీ 23 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఫైనల్లో అడుగుపెట్టింది. మధ్యప్రదేశ్‌ కెప్టెన్‌ ఆధిత్య శ్రీవాస్తవ జట్టును విజయవంతగా నడిపించి విజయంలో ప్రత్యక్ష పాత్ర వహిస్తే.. పరోక్షంగా ఆ జట్టు కోచ్‌ టీమిండియా మాజీ క్రికెటర్‌ చంద్రకాంత్‌ పండిట్‌ కీలకపాత్ర వహించాడు. కెప్టెన్‌గా తాను సాధించలేనిది ఇవాళ కోచ్‌ పాత్రలో అందుకున్న సంతోషం ఆయన కళ్లలో కనబడింది.

మధ్యప్రదేశ్‌ విజేతగా అవతరించిదని తెలియగానే కన్నీటి పర్యంతమైన చంద్రకాంత్‌ పండిట్‌ గ్రౌండ్‌లోకి నడుచుకుంటూ వెళ్లాడు. తమ విజయం వెనుక కోచ్‌ పాత్రను గుర్తించిన మధ్యప్రదేశ్‌ ఆటగాళ్లు చంద్రకాంత్‌ పండిట్‌ను తమ భుజాలపై మోసుకుంటూ గ్రౌండ్‌ మొత్తం కలియదిరిగారు. ఒక కోచ్‌కు ఇంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

టీమిండియా ఆటగాడిగా అంతగా సక్సెస్‌ కాలేకపోయిన చంద్రకాంత్‌ పండిట్‌ రంజీ కోచ్‌గా సూపర్‌ సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. చంద్రకాంత్‌ రంజీ కోచ్‌గా అడుగుపెట్టాకా ముంబైని(2002-03, 2003-04,2015-16) మూడుసార్లు, విదర్భను(2017-18, 2018-19) రెండుసార్లు రంజీ చాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా మధ్యప్రదేశ్‌ను తొలిసారి రంజీ విజేతగా నిలిపి చంద్రకాంత్‌.. కెప్టెన్‌గా సాధించలేనిది కోచ్‌గా తన లక్ష్యం నెరవేర్చుకున్నాడు.


కెప్టెన్‌గా సాధించలేకపోయాడు.. కోచ్‌ పాత్రలో
మధ్యప్రదేశ్‌ రంజీ చరిత్రలో తొలిసారి ఫైనల్‌ చేరింది 1998-99 సీజన్‌లో. ఆ సీజన్‌లో మధ్యప్రదేశ్‌ కెప్టెన్‌గా చంద్రకాంత్‌ పండిట్‌ వ్యవహరించాడు. సీజన్‌ ఆరంభం నుంచి మంచి ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన పండిట్‌ సేన ఫైనల్లో కర్ణాటకతో తలపడింది. ఫైనల్‌ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ సాధించినప్పటికీ.. ఆఖరి రోజు ఆఖరి సెషన్‌లో అనూహ్యంగా కుప్పకూలి ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రంజీ కోచ్‌గా అవతారం ఎత్తిన చంద్రకాంత్‌ పండిట్‌ గోల్డెన్‌ కోచ్‌గా మారిపోయాడు.  ఇక చంద్రకాంత్‌ పండిట్‌ టీమిండియా తరపున 1986-92 వరకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్‌ తరపున చంద్రకాంత్‌ 5 టెస్టులు, 23 వన్డేలు ఆడాడు.

మళ్లీ 23 ఏళ్ల తర్వాత ఫైనల్‌ చేరిన మధ్యప్రదేశ్‌ ఈసారి మాత్రం అనుకున్నది సాధించింది. ఫైనల్లో ముంబైపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారి రంజీ చాంపియన్‌గా అవతరించింది. 113/2 క్రితం రోజు స్కోరుతో ఐదోరోజు ఆటను ప్రారంభించిన ముంబై 269 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 108 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన మధ్యప్రదేశ్‌ వన్డే తరహా ఆటతీరును ప్రదర్శించింది. హిమాన్షు మాంత్రి 37 పరుగులు చేయగా.. రజత్‌ పాటిధార్‌ 30 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

చదవండి: కొత్త చరిత్ర ఆవిష్కృతం.. రంజీ ట్రోఫీ విజేత మధ్యప్రదేశ్

మరిన్ని వార్తలు