CPL 2021: టార్గెట్‌ 131 అయితే అతనొక్కడే 105 పరుగులు చేశాడు.. 

5 Sep, 2021 15:22 IST|Sakshi

సెయింట్ కిట్స్‌: కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ 2021లో భాగంగా బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ చంద్రపాల్‌ హేమరాజ్‌(56 బంతుల్లో 105 నాటౌట్‌; 14 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి నిర్ధేశించిన లక్ష్యాన్ని ఒంటిచేత్తో ఛేదించాడు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన బార్బడోస్ రాయల్స్‌.. నిర్ణీత ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. గయానా వారియర్స్ బౌలర్లు ఇమ్రాన్‌ తాహిర్‌(3/34), రోమారియో షెపర్డ్‌(2/33), మోటీ(1/15), ఓడియన్‌ స్మిత్‌(1/22) దెబ్బకు బార్బడోస్ జట్టు పేకమేడలా కూలింది. 

ఈ ఇన్నింగ్స్‌లో బార్బడోస్ ఆటగాళ్లు ముగ్గురు రనౌట్‌ కాగా, వికెట్‌కీపర్‌ అజామ్‌ ఖాన్‌(28) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం​ 131 పరుగుల ఛేదనలో హేమరాజ్‌ ఒక్కడే అజేయమైన 105 పరుగులు సాధించడంతో గయానా జట్టు 14.2 ఓవర్లలో ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా ప్రత్యర్ధిపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గయానా మరో ఓపెనర్‌ బ్రెండన్‌ కింగ్‌(17 బంతుల్లో 19; 2 ఫోర్లు) వికెట్‌ బార్బడోస్‌ బౌలర్‌ యంగ్‌కు దక్కింది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ షోయబ్‌ మాలిక్‌(13 బంతుల్లో 8 నాటౌట్‌; ఫోర్‌)తో కలసి హేమరాజ్‌ గయానాను విజయతీరాలకు తీర్చాడు. 

చదవండి: వైరలవుతున్న రోహిత్‌ ఐదేళ్ల కిందటి ట్వీట్‌.. ‘చెప్పాడంటే చేస్తాడంతే’

మరిన్ని వార్తలు